Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాజీపేటలో విషాద ఘటన
- పలువురు నేతల పరామర్శ
నవ తెలంగాణ-నర్సాపూర్
కొడుకు మృతి చెందాడన్న వార్త విన్న తల్లి గుండె ఆగిపోయిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్లే... కాజీపేట గ్రామానికి చెందిన ముచ్చర్ల విజయ్ కుమార్(32) గ్రామంలో డెయిరీఫామ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. డెయిరీఫామ్‌లో పెట్టుబడి కోసం అప్పులు చేశారు. చిరువ్యాపారంలో ఆదాయం రాకపోగా అప్పులు అధికమయ్యాయి. అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కండ్ల ముందే ఆత్మహత్యకు పాల్పడి విగత జీవిగా మారిన కొడుకు మృతదేహాన్ని చూసి కలత చెందిన తల్లి స్వరూప ఆదివారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందింది. తల్లీ కొడుకు ఒకేసారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాజీపేట గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాన్ని పరమర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ నయీముద్దీన్, పీఏసీఎస్ చైర్మెన్ రాజు, కాజీపేట సర్పంచ్ హేమలత మదన్మోహన్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాజీపేట ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్, తదితరులు పరామర్శించారు.