Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలి : భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు
నవతెలంగాణ-మట్టెవాడ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 లక్షలమంది అడ్డా కూలీలు పనికెళ్తేగాని పూట గడవని పరిస్థితి ఉందని, వారిని వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ వరంగల్ జిల్లా రంగశాయిపేట కమిటీ ఆధ్వర్యంలో నాయుడు పెట్రోల్ పంపు వద్ద పుచ్చలపల్లి సుందరయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం లేబర్ అడ్డా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన హాజరై రిబ్బన్ కట్ చేసి అడ్డాను ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి జెండావిష్కరణ చేశారు. అనంతరం సీఐటీయూ ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో రాములు మాట్లాడారు. ఆర్టీఏ ఆఫీస్ జంక్షన్లో పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో నూతనంగా లేబర్ అడ్డాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవన నిర్మాణ రంగానికి చెందిన 14 రకాల కార్మికుల్లో అడ్డాకు వచ్చే ప్రతి ఒక్కరికి పని దొరికేలా అందరూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కూలీల సంక్షేమానికి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న రూ.3400 కోట్లు కూలీల సంక్షేమానికి వినియోగించాలని జీఓ జారీ చేసినా, ఆచరించకుండా నిధుల్ని మళ్లించడం సరికాదన్నారు. లేబర్ అడ్డాల్లో మహిళా కూలీలకు కనీస సౌకర్యాలు, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డుమీద పని కోసం ఎదురు చూస్తుంటే ఆర్టీఏ వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. చివరికి షాపు యజమానులతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి లేబర్ అడ్డాల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో వాహనాలు నడిపే కూలీలకు ఆర్టీఏ వేధింపులు ఎక్కువయ్యాయని, వాటిని మానుకోవాలని అన్నారు. అనంతరం ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ మాట్లాడుతూ... అందరికీ పని దొరకాలనే మంచి లక్ష్యంతో అన్ని విభాగాల భవన నిర్మాణ కార్మికులతో లేబర్ అడ్డాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అడ్డావద్దకు వచ్చిన ప్రతి కూలికి పని దొరికేలా అన్ని విభాగాల భవన నిర్మాణ రంగాల్లోని అధ్యక్ష కార్యదర్శులు, 52 మంది మేస్త్రీలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు గణేపాక ఓదెలు, సంబమూర్తి, మాలోత్ ప్రత్యూష, లక్క రమేష్, రత్నం,14 విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.