Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ - బోనకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య విమర్శించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 'వ్యవసాయ రంగం - సంక్షోభం- ప్రస్తుత పరిస్థితుల'పై సోమవారం సెమినార్ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సెమినార్లో వీరయ్య మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల జీవితాల గురించి మాట్లాడకుండా వ్యవసాయం గురించి మాట్లాడలేమన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లనే రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాలు మంచిగా ఉన్నప్పుడే వ్యవసాయ రంగం సంక్షోభంలో లేనట్టని తెలిపారు. కార్మికులు లేకుండా వ్యవసాయం సాగుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ధనిక వర్గాల కోసం పని చేస్తున్నారే తప్ప పేదల గురించి పట్టించుకోవటం లేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, ఇలా అయితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండదా అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులపై ప్రభుత్వాలకు భక్తి విపరీతంగా ఉందన్నారు. కానీ రైతులపై ఎటువంటి భక్తి, ప్రేమ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు రూ. 5 లక్షల కోట్లు మాఫీ చేసిందని తెలిపారు. ఎరువులు, పురుగుమందుల ధరలను విపరీతంగా పెంచి వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసినప్పుడే మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడుతుందన్నారు. దేశంలో ఆహార ఉత్పత్తుల నిల్వలు దారుణంగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ రంగానికి మతం రంగు పూస్తున్నాడని విమర్శించారు. సెమినార్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు చింతలచెరువు కోటేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు, వ్యకాస మండల అధ్యక్ష కార్యదర్శులు ఉమ్మనేని రవి, బంధం శ్రీనివాసరావు, ఐద్వా మండల ఉపాధ్యక్షులు గుగులోతు శారద, టీఎస్ యుటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, సీఐటీయూ మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, ఆర్ఎంపీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొంగర భూషయ్య తదితరులు పాల్గొన్నారు.