Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీడబ్ల్యూ నిధుల దుర్వినియోగంపై నిఘా
- వరంగల్‌లో కేటుగాళ్లను అరెస్టు చేసిన పోలీసులు
- మిగిలిన జిల్లాల్లోనూ ఆరా..
- భయాందోళనలో కార్మికశాఖఉన్నతాధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన సంక్షేమ బోర్డు అవినీతికి అడ్డాగా మారింది. బోగస్ లబ్దిదారుల కోసం పనిచేస్తూ అవినీతిపరులకు కొమ్ముకాస్తోంది. అయితే, వీటిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనిపై పోలీసులు సైతం దృష్టిసారించడంతో అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటికి వస్తోంది. అందులో భాగంగానే వరంగల్ జిల్లాలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లోనూ డొంక కదులుతోంది.
అంతా బాగానే ఉంది!
తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(బీసీఓడబ్ల్యూ)లో నిధుల గోల్మాల్ కొనసాగుతోంది. నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించి బోగస్ లబ్దిదారుల పేరుతో నిధులు కాజేశారు. వరంగల్ జిల్లాలో కొంత మందిని అరెస్టు కూడా చేశారు. అయితే, హైదరాబాద్‌లోని కార్మికశాఖ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు మాత్రం 'అంతా బాగానే ఉంది.. ఎలాంటి అవకతవకలు లేవు.. మా దగ్గరకు ఫిర్యాదులు రాలేదు' అని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ఇతర జిల్లాల్లో వందల సంఖ్యలో బోగస్ క్లెయిమ్స్‌తో నిధులను దారిమళ్లిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక్క వరంగల్ జిల్లాలోని శాయంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, ఆత్మకూరు మండలాల్లో పోలీసులు జాయింట్ అపరేషన్‌తో నిందితులను అరెస్టు చేశారు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై నిర్లక్ష్యం
అవినీతి ఆరోపణలు, బోగస్ పేరుతో దుర్వినియోగంపై నిందితులను అరెస్టు చేసినా కార్మికశాఖ అధికారుల్లో మార్పు రావడం లేదనే విమర్శలూ లేకపోలేదు. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అమలు చేయడం లేదు. తెలుగు అకాడమీలో జరిగిన నిధుల గోల్మాల్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ ఎంఎస్ నెం.18లో ఎఫ్డీలను 3 బ్యాంకులకు మించి పెట్టకూడదని సూచించింది. కానీ కార్మికశాఖ మాత్రం రూ.1000కోట్ల నిధులను ఏడు బ్యాంకులకు చెందిన 150కిపైగా బ్రాంచ్‌ల్లో 450కిపైగా ఎఫ్డీలను పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.