Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ, తమిళనాడు గవర్నర్ల తరహాలో..
- రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించండి...
- 'వర్సిటీ'ల బిల్లుపై మంత్రి సబితకు గవర్నర్ తమిళి సై ఆదేశం
- రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్న మోడీ సర్కార్ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇప్పటిదాకా కేరళ, తమిళనాడు సీఎంలు అక్కడి గవర్నర్ల చర్యలను నిరసిస్తూ వచ్చిన సంగతి విదితమే. అయినా వారి తీరులో ఎలాంటి మార్పూ రాలేదు. ఇదే కోవలో మొన్నటిదాకా తెలంగాణ ప్రభుత్వాన్ని పలు అంశాల్లో ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించిన గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్... మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాస్త సైలెంటయ్యారు. ఆ ఎన్నిక ఫలితం వచ్చిన మరుసటి రోజైన సోమవారమే ఆమె టీఆర్ఎస్ సర్కారుతో కయ్యానికి కాలుదువ్వారు. ఈ క్రమంలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజ్‌భవన్‌కు వచ్చి బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచనతో కూడిన హుకూం జారీ చేశారు. ఈ బిల్లుపై అభిప్రాయం కోరుతూ యూజీసీకి సైతం ఆమె లేఖ రాశారు. రాష్ట్ర శాసనసభ, మండలి ఇటీవల ఆమోదించిన ఏడు బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కీలకమైన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు ఒకటి. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు, విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకుల భర్తీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని సర్కారు భావించింది. అందుకనుగుణంగా బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ, మండలిలో ఆమోదించింది. అయితే ఆ బిల్లు ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఇటీవల విద్యార్థి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదానికి ఒత్తిడి వస్తోంది. రెండు రోజుల్లో దాన్ని ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి లేఖ రాశారని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంలో బిల్లులపై చర్చకు రావాలంటూ మంత్రి సబితను గవర్నర్ ఆహ్వానించినట్టు పైకి కనబడుతున్నా... లోపల మాత్రం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించటం, సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేయటం తదితర రాజకీయ అంశాలు దాగున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే మంత్రిని రాజ్‌భవన్‌కు రప్పించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారనే వాదన వినబడుతున్నది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి.