Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ ప్రకటన
- అభ్యంతరాలకు నెల రోజుల గడువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక విజయం ఇచ్చిన ఊపుతో జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన క్రమంలో దానిపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలపొచ్చని సూచించారు. నెల రోజుల్లోగా వాటిని ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకుపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొన్ని హిందీ, ఆంగ్ల పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ పేరు మీద ఎలాంటి పార్టీ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి... ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పర్యవేక్షిస్తున్నాయని ఆయా వర్గాలు వివరించాయి.మరోవైపు మునుగోడు విజయంతో బీఆర్ఎస్కు మాంచి ఊపొచ్చిందని గులాబీ పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. ఇందుకనుగుణంగా ఆదివారం ఫలితం వెలువడిన వెంటనే హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో 'బీఆర్ఎస్ ఫస్ట్ విక్టరీ...' అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. దీంతోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్ని కల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎలా ప్రచారం నిర్వహించాలి..? ఆ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎలాంటి తర్ఫీదునివ్వాలనే దానిపై కేసీఆర్ ముమ్మ ర కసరత్తులు చేస్తున్నారు. బీజేపీ విధానాలు, మోడీ సర్కారు చర్యలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ఇప్పుడు తమపై మరింత పెరిగిందని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఇందులో భాగంగా మునుగోడులో బీజేపీని నిలువరించేందుకు సహకరించిన వామపక్షాలతో కలిసి కేంద్రంపై పోరుకు రూపకల్పన చేస్తున్నారు. మొదటగా ఈనెల 12న రాష్ట్రానికి ప్రధాని మోడీ రాకను పురస్కరించుకుని లెఫ్ట్ పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఆందోళన చేపట్టనుంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే సందర్భంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన పెద్ద నోట్ల రద్దు, దాని వల్ల దేశ ప్రజలు పడ్డ ఇబ్బందులను ఏకరువు పెడుతూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేయటం గమనార్హం.