Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తిస్థాయిలో పనిచేస్తే వంద శాతం గెలిచేవాళ్లమన్న ఈటల
- నా మనస్సులో ఏం లేదంటున్న బండి
- సమీక్షలో కానరాని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, డీకే అరుణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో మునుగోడు చిచ్చు రాజుకుంటున్నది. ఉప ఎన్నిక ఓటమిపై జరిగిన సమీక్షకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ హాజరుకాకపోవడం చర్చనీయాంశం అవుతున్నది. 'మేం ఎంత మేరకు పనిచేయాలో అంత మేరకు పనిచేయలేదు. ఒకవేళ పనిచేస్తే వందశాతం గెలిచేవాళ్లం' అంటూ ఈటల మాట్లాడటం, 'నా మనస్సులో ఏం లేదు. నా కసి అంతా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడమే' అంటూ బండి వ్యాఖ్యానించడం లాంటి పరిణామాలు ఆ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతున్నదని ఇట్టే అవగతమవుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలనే బీజేపీ ఎత్తుగడ తలకిందులైంది. నైతిక విజయం తమదే అంటూ బీజేపీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ ఫలితం ఆ పార్టీకి మింగుడుపడని అంశమే. ఆర్థికబలమున్న రాజగోపాల్‌రెడ్డినే టీఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాల ముందు బొక్కబోర్లాపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఆ పార్టీలో చేరితే తమకు అంతగా ప్రయోజనం చేకూరదేమో అన్న భావన గోడమీద కూర్చుని ఎదురుచూస్తున్న నేతల్లోనూ మొదలైంది. దీంతో బీజేపీ వైపు మొగ్గుచూపటం మానేసి గమ్ముగా ఉండిపోనున్నారు. ఉప ఎన్నిక ఓటమి అనంతరం జరిగిన కీలక సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పాల్గొనలేదు. కిషన్‌రెడ్డి ఏపీ పర్యటనలో ఉన్నారు. ఇప్పుడే కాదు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి బీజేపీ అగ్రనాయకులు అక్కడ పెద్దగా దృష్టి పెట్టి పనిచేసింది అంతంతే. దుబ్బాక, హుజురాబాద్‌లో ఇన్‌చార్జీగా ఉండి గెలిపించిన జితేందర్‌రెడ్డిని కాదని మునుగోడులో వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించడంపైనా అగ్రనాయకులు కొందరు కినుక వహించారు. స్టీరింగ్ కమిటీ చైర్మెన్‌గా వివేక్ వెంకటస్వామి కావాలని రాజగోపాల్‌రెడ్డి పట్టుబట్టి మరీ నియమించుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలను ఆయన లైట్‌గా తీసుకున్నారు. అమిత్‌షా, జాతీయ నాయకులతోనే నేరుగా టచ్‌లో ఉన్నారు. ఇది రాష్ట్ర నాయకులకు మింగుడు పడలేదు. అందుకే కొద్దిరోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఏరికోరి వేయించుకున్న స్టీరింగ్ కమిటీ మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఉప ఎన్నిక మధ్యలో ఆ కమిటీలోని కీలక సభ్యులైన దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ కాడెత్తేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు జుగుప్సాకరంగా ఉంటున్నాయని పార్టీని వీడే క్రమంలో వారిద్దరూ ఎత్తిచూపారు. అలా ఆ పార్టీలో నేతల మధ్య కొనసాగుతున్న గ్యాప్ రోజురోజుకీ మరింత పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. నడ్డా పర్యటన రద్దు, మండలాల్లో బైకుల ర్యాలీలకు కేంద్ర మంత్రుల రాకుండా చేయడంలో ఓ నేత కీలక భూమిక పోషించినట్టు తెలిసింది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్లగా ఆయా గ్రామాలకు, మండలాలకు ఇన్‌చార్జీలుగా పెట్టిన నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయలేదనే చర్చ నడుస్తున్నది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలనే విషయం దగ్గర నుంచి నేటి వరకూ ఈటల, బండి మధ్య పొరపచ్చాలున్నట్టు సమచారం. మరోవైపు తరుచూ కేంద్ర నాయకత్వం ఈటలను ఢిల్లీకి పిలవటం, చేరికల కమిటీ చైర్మెన్‌గా నియమించడం వంటి పరిణామాలు ఇన్నేండ్లుగా రాష్ట్రంలో కర్త, కర్మ, క్రియగా పార్టీని శాసిస్తున్న లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలకు ఏమాత్రం నచ్చట్లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు డీకే అరుణకు, కిషన్‌రెడ్డికి మధ్య బేధాభిప్రాయాలున్నాయనే చర్చా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి జాడ పెద్దగా కనిపించట్లేదు. ఇలా బీజేపీ నేతల మధ్య రగులుతున్న కుంపటినే రాజగోపాల్‌రెడ్డి పుట్టి ముంచినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే అక్కడ గెలిచే అవకాశం ఉండేదన్న భావన కార్యకర్తల్లో ఉంది.