Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణ వ్యర్థాలు, చెత్తాచెదారం డంపింగ్
- జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్లక్ష్యం
నవతెలంగాణ- సిటీబ్యూరో, అంబర్‌పేట
ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకోగా.. మూసీ పరివాహక ప్రాంతాలు కూడా ఆక్రమణలో చిక్కుకుని నీరు పారడానికి ఇబ్బంది తలెత్తుతోంది.. చినుకు పడితే దిగువకు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఎన్నో చెరువులు తమ ఉనికిని కోల్పోయాయి. జియాగూడ, పురాణాపూల్ శ్మశాన వాటిక, జుమ్మేరాత్ బజార్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, గోల్నాక తదితర మూసీ పరివాహక ప్రాంతాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇదే తరహాలో మూసారాంబాగ్‌లోని మూసీ పరివాహక ప్రాంతాన్ని భూ కబ్జాదారులు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. పరిరక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.చినుకుపడితే చాలు గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే.. దిగువన మూసీ పరివాహక ప్రాంతాలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో పలు బస్తీలు, కాలనీలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మూసీ పొంగిపొర్లింది. మూసారాం బ్రిడ్జిపై నుంచి వరద పారడంతో రాకపోకలు బంద్ చేశారు. వర్షం కురిసినప్పుడల్లా బ్రిడ్జిపై మురుగునీరు వెళ్లడం, ఈ క్రమంలో అధికారులు రాకపోకలను నిలిపివేయడం పరిపాటిగా మారింది. మూసీ పరివాహక ప్రాంతం కబ్జాలకు గురికావడంతోనే ఈ దుస్థితి ఏర్పడుతోందని ప్రజాసంఘాలు తెలిపాయి. మూసీ కబ్జాకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖల అధికారులు, మంత్రులు, రాజకీయ నాయకులు చెబుతున్నా.. ఆ తర్వాత షరా మామూలుగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
యథేచ్చగా కబ్జా..
నగరంలో మూసీ కాలువ రోజురోజుకూ కుచించుకుపోతోంది.. కొందరు రాజకీయ, ఆర్థిక పలుకుబడితో కాలువను దర్జాగా కబ్జా చేస్తున్నారు. దశాబ్దాల నాటి కాలువను కనుమరుగు చేస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని కాలువలో డంప్ చేసి చదును చేసుకుంటున్నారు. మూసీని పరిరక్షించాల్సిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మిగిలిన స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి. ఓ వైపు కోట్ల రూపాయలు వెచ్చించి మూసీ నదిని ప్రభుత్వం సుందరీకరిస్తుండగా, మరో వైపు ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ పరివాహక ప్రాంతాలను పూడ్చేస్తున్నారు. మూసారాంబాగ్‌లోని మూసీ పరివాహక ప్రాంతాన్ని కొందరు కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. మూసీ బఫర్‌జోన్ ప్రాంతంలోని స్థలంలో అక్రమంగా భూమిని చదును చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, మూసీ పరివాహక ప్రాంతాన్ని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలి:ఎం.మహేందర్- సీపీఐ(ఎం) అంబర్పేట్ నగర నాయకులు
మూసీ నదికి హద్దులు గుర్తించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందువల్లే కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. నిర్మాణ వ్యర్థాలు నదిలో డంప్ చేస్తున్నారు. మరికొందరు పార్కింగ్ ప్రదేశాలుగా మార్చుకున్నారు. కొందరు చదును చేసి కబ్జా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.