Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకటో తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు కావాలంటూ మెలిక
- ఎంఆర్వో కార్యాలయాల చుట్టూ అభ్యర్థులు
- స్టడీ సర్టిఫికెట్ల కోసం పరుగులు
- పార్టు-2 ప్రక్రియ పూర్తయితేనే డిసెంబర్లో ఈవెంట్స్?
కానిస్టేబుల్, ఎస్.ఐ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎంపికలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఇప్పటికే ఆందోళన చెందుతుంటే.. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు మరో తిరకాసు పెట్టింది. స్టడీ సర్టిఫికెట్ల సమస్య తెచ్చింది. ఒకటో తరగతి నుంచి మొత్తం స్టడీ సర్టిఫికెట్లు కావాలనడంతోపాటు.. డిగ్రీ సర్టిఫికెట్లు కూడా 2022 జూన్ ఒకటో తేదీ లోపు ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. వీటన్నింటితో.. తమ ఆశలపై నీళ్లు చల్లారంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టు-2 దరఖాస్తు ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు సమస్యలు.. సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లూ కలవడం లేదు. దాంతో పార్టు-2 దరఖాస్తు ప్రక్రియను పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
నవతెలంగాణ- సిటీ బ్యూరో (ఇ.రత్నాకర్)
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) రెండు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఐ (587), కానిస్టేబుల్స్ (16,929) కలిపి మొత్తం 17,516 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. దాంతో ఎస్ఐకి 2,47,217 మంది, కానిస్టేబుల్ పోస్టులకుగాను సుమారు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్ఐ పరీక్షను 2,25,759, కానిస్టేబుల్ పరీక్షను 6,03,955 అభ్యర్థులు రాశారు. ఎస్ఐ పరీక్షలో 1,05,603 అభ్యర్థులు పాస్‌కాగా, కానిస్టేబుల్ పరీక్షలో 1,84,861 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లో కలిపి 2.90లక్షల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. అయితే, పార్టు-2 దరఖాస్తుకు వచ్చేసరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈవెంట్స్ కోసం సన్నద్ధం
రెండు విభాగాల్లో పాసైన అభ్యర్థులు ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, గతంలో పురుషులకు 800 మీటర్లు, లాంగ్ జంప్, షార్ట్‌పుట్ 100 మీటర్లు ఈవెంట్స్ ఉండేవి. మహిళలకు 100 మీటర్లు, లాంగ్ జంప్, షార్ట్‌పుట్ ఉండేది. కానీ, ఇప్పుడు పురుషులకు 1600 మీటర్లు, లాంగ్ జంప్, షార్ట్‌పుట్ ఉంది. మహిళలకు 800 మీటర్లు, లాంగ్ జంప్, షార్ట్‌పుట్ ఈవెంట్స్ పెట్టారు. ఈవెంట్స్‌లో అర్హత సాధించాలని అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు.
జులైలోగా డిగ్రీ సర్టిఫికెట్లు ఎలా సాధ్యం..
పోలీసు శాఖకు చెందిన ఈ రెండు విభాగాల ఉద్యోగాల కోసం 2022 జులై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే, కరోనా ప్రభావంతో మేలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు జూన్-జులై నెలలో జరిగాయి. వాటి ఫలితాలు ఆగస్టు రెండో వారంలో వెలువడ్డాయి. పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లో జులై 1లోపే డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలని పేర్కొనడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. డిగ్రీ చివరి సంవత్సరం రాసిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఎస్ఐ పరీక్షల్లో అర్హత సాధించారు. వారంతా ఇప్పుడు పార్టు-2లో ఎస్ఐ, కానిస్టేబుల్‌కు దరఖాస్తు చేసుకోవాలా లేక కానిస్టేబుల్‌కే దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్లు జులై తర్వాత అందడంతో ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా లేదో తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లకు అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. అయితే, అవి కలవకపోవడంతో అభ్యర్థులకు తెలిసిన వారితో వాకబ్ చేస్తున్నారు.
సర్టిఫికెట్ల కోసం నిరీక్షణ
పార్టు-2 దరఖాస్తుల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లతోపాటు కుల ధృవీకరణ పత్రాలు, బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లను పొందుపర్చాలని బోర్డు సూచించింది. ఇప్పుడు వాటి కోసం వివిధ మండలాల తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి ఎక్కువ సమయం తీసుకోవడం, మరోపక్క పార్టు-2 అప్లికేషన్‌కు చివరి తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
మాయమైన పాఠశాలలు
స్థానికత కోసం పార్టు-2లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్స్ జత చేయాల్సి ఉంది. అవి ఉంటేనే కంప్యూటర్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. దాంతో సర్టిఫికెట్ల కోసం (20-25 ఏండ్ల కిందట) ఎప్పుడో చదివిన పాఠశాలలకు అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. అయితే, కొన్ని చోట్ల ఆ పాఠశాలలు లేకపోవడం, మరికొన్ని చోట్ల ఆ పాఠశాలలు వేరే పాఠశాలలో విలీనం కావడం, ఇంకొన్ని చోట్ల పాఠశాలలు రద్దు కావడంతో అభ్యర్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవేళ చదువుకున్న పాఠశాలలున్నా యాజమాన్యాలు మారడం, ఇంకొన్ని చోట్ల సర్టిఫికెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులున్నాయి. అసలు అప్పటి ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు లేవు. స్టడీ సర్టిఫికెట్లు లేనిచోట్ల ఎంఆర్వో కార్యాలయం నుంచి రెసిడెన్సీ సర్టిఫికెట్లు తీసుకోవాలని బోర్డు సూచించింది. అది ఇవ్వడానికి కూడా అధికారులు విచారణ, ఇతర వివరాల కోసం తిప్పలు పెడుతున్నారు. దాంతో అభ్యర్థులు తాసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మార్చి మొదటి వారంలో మెయిన్స్..?
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టులో పూర్తికాగా, అక్టోబర్‌లో ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్ 25వరకు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈవెంట్స్ కోసం స్టేడియంలు, కంప్యూటర్లు, సిబ్బందిని సిద్ధంగా పెట్టుకోవాలని అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలను బోర్డు ఆదేశించింది. డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి రెండో వారం వరకు ఈవెంట్స్ నిర్వహించే అవకాశముంది. ఇదే జరిగితే ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో మెయిన్స్ పరీక్షలు జరిగే అవకాశమున్నట్టు విశ్వసనీయ సమాచారం.