Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ను గెలిపించిన వామపక్షాలకు ధన్యవాదాలు
- ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) నేతలను కలిసిన మంత్రి జగదీశ్ రెడ్డి, కూసుకుంట్ల
- మోడీ సర్కారు మళ్లీ వస్తే మధ్యయుగాలనాటి పరిస్థితి
- ప్రభుత్వపరంగా సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి
- మునుగోడులో సైద్ధాంతిక పోరాటం చేశాం
- బీజేపీని దేశభక్తులందరూ తరిమికొట్టాలి
- 12న ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నిరసన : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలతో భవిష్యత్‌లోనూ కలిసే పనిచేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీ రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు ఓ నర్సింహ్మారెడ్డి వచ్చారు. వారికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డిజి నరసింహా రావు, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, టి సాగర్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్చం అందించి మిఠాయిలు తినిపించుకున్నారు. ఆ తర్వాత సీపీఐ (ఎం) నేతలతో వారు భేటీ అయి పలు అంశాలంపై చర్చించారు. అంతకు ముందు ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీపీఐ(ఎం) నేతలను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మును గోడులో టీఆర్ఎస్కు మద్దతిచ్చిన సీపీఐ(ఎం) నేతలకు కృతజ్ఞతలు చెప్పడం కోసమే వచ్చానని చెప్పారు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఈ దేశాన్ని మధ్యయుగాల నాటి పరిస్థితులకు తీసుకెళ్తుందని విమర్శించారు. ఆ పార్టీని నిలువరించే శక్తి టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు ఉన్నందునే సీపీఐ, సీపీఐ(ఎం) మద్దతిచ్చాయని అన్నారు. మునుగోడులో ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులతోపాటు ఇతర నాయకు లు, కార్యకర్తలు పనిచేశారనీ, కసితో మతోన్మాద శక్తులను ఓడించారని వివరించారు. ఈ ఐక్యత ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. తద్వారా దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ఎనిమిదేం డ్లుగా మోడీ ప్రభుత్వం తిరోగమన విధానాలను అవలంభించిందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలు బీజేపీ కుట్రపూరితంగా తెచ్చిందన్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను పడగొట్టడంతోపాటు పలు అక్రమాలు, దుర్మార్గాలకు పాల్ప డిందన్నారు. కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేసిందని చెప్పారు. బేరసారాకు తెరలేపినప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి లొంగిపోలేదన్నారు. మునుగోడు ఫలితం బీజేపీకి చెంపపెట్టులాంటిదని అన్నారు. ఇక్కడి నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభమవు తుందన్నారు. ఈ ప్రక్రియలో వామ పక్ష పార్టీలు, నాయకులు చారిత్రక బా ధ్యతను నెరవేర్చారని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వపరంగా చేయా ల్సినవి పరిష్కరిస్తామని చెప్పారు. వా టిని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. అభివృద్ధి నిరోధక శక్తులకు వ్యతిరేకం గా కమ్యూ నిస్టులతో భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తామన్నారు. బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కోరారు.
వాళ్లిద్దరూ... వారికిద్దరూ : తమ్మినేని
నిజాంకు వ్యతిరేక పోరాడిన గడ్డ తెలంగాణ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కమ్యూనిస్టుల బలం ప్రస్తుతం తక్కువగా ఉండొచ్చు... కానీ తమ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లోనూ బీజేపీని ఎదుగుదలను అడ్డుకుంటామన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించేం దుకు, టీఆర్ఎస్ను గెలిపించేందుకు సైద్ధాంతిక పోరాటం చేశామని వివరించారు. ప్రతివ్యక్తికీ బీజేపీ ప్రమా దాన్ని వివరించామని అన్నారు. గవర్న ర్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. తెలంగాణ గవర్నర్ వద్ద అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ ని చెప్పారు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఏడాది కింద ప్రారంభమైన రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రధాని మోడీ మళ్లీ ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే రూ.87 కోట్ల లాభం వచ్చిందన్నారు. ప్రధాని స్థాయిలో మోడీ ఇలా వ్యవహరించడం సరైంది కాదని చెప్పారు. ఈనెల 12న రామగుండం లో ప్రధాని పర్యటన సందర్భంగా నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలో బలహీనంగా ఉన్న బీజేపీ ఎదగడం కోసమే మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చిందని అన్నారు. ఈడీ, సీబీఐ, డబ్బు, అధికారం ప్రభావంతో గెలిచి కాంగ్రెస్ ను నాశనం చేసి టీఆర్ఎస్కు ప్రత్యా మ్నాయం తామేనని రుజువు చేయా లని భావించిందన్నారు. ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన ఆ పార్టీ దేశానికే ప్రమాదకరమని అన్నా రు. ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అది వ్యతిరేక మని వివరించారు. కుల వ్యవస్థ ఉండాలని కోరుకునే పార్టీ బీజేపీ అనీ, అది సమానత్వాన్ని కోరుకోదని చెప్పా రు. చాతుర్వర్ణ వ్యవస్థ, మనుధర్మం అమలుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అడ్డుగా వస్తున్నదని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులపై దాడి చేస్త్తున్నదని విమర్శించారు. వాళ్లిద్ద రూ.. మోడీ, అమిత్‌షా, వారికిద్దరూ అంబానీ, అదానీ అని చెప్పారు. ఉత్తర భారతాన్ని ఒకరికి, దక్షిణ భారతాన్ని మరొకరికి అప్పగించిందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, సహజ సంపదను కార్పొరేట్లకు అమ్మేస్తున్నదని విమర్శించారు. ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా దేశభక్తులందరూ పోరా డాలని పిలుపునిచ్చారు. ఈ కర్తవ్యాన్ని నిరూపించేందుకు టీఆర్ఎస్కు మద్దతిచ్చామనీ, ఈ నిర్ణయం నూటికి నూరుపాళ్లు నిజమైందని చెప్పారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతానని అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ సహా ఇతర మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
సీపీఐ నేతలతోనూ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో సీపీఐ నేతలతో మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఈటి నర్సింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డికి సీపీఐ నేతలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీపీఐ నేతలను మార్యదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వామపక్షాలతో టీఆర్ఎస్ ఐక్యతను ఇక ముందు కూడా కొనసాగిస్తామని అన్నారు. దేశంలో మతతత్వ, అభివృద్ధి నిరోధక శక్తులను నిలువరించేందుకు ప్రగతిశీల శక్తులు కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. ఇదే పద్ధతిలోనే ప్రయాణం చేస్తామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీకి ముగింపు కార్డ్ వేశామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామంటూ ఇది వరకే సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.