Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ పెద్దల కోసం రైతులు, పేదలకు ఇక్కట్లు
- వరంగల్లోనూ గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితుల నిరసనలు
- మహారాష్ట్ర తరహాలో బ్రౌన్ ఫీల్డ్ రహదారిగా మార్చాలని డిమాండ్
- మూడు పంటల భూములను నాగపూర్- అమరావతి హైవేకు ఇవ్వం
- మహబూబాబాద్- కోదాడ రూట్‌తో ప్రత్యామ్నాయం చూపుతున్న రైతులు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు నాలుగేండ్ల్లుగా హైవే నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నా కార్పొ'రూట్' కోసం కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. నాగపూర్ - అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు రైతులు, పేదలపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ రోడ్డు నిర్మిస్తే ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ నీటిసౌకర్యం ఉన్న మూడు పంటలు పండే సారవంతమైన, గ్రానైట్ నిక్షేపాలున్న విలువైన భూములతో పాటు ఖమ్మం సరిహద్దులో సుమారు 200కు పైగా ఇందిరమ్మ ఇండ్ల స్థలాల లబ్దిదారులు కూడా నిర్వాసితులవుతారు. ఇలా మొత్తంగా సుమారు 800 మందికి పైగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. పైగా శబ్ద, వాయు, నీటి కాలుష్యం చోటుచేసుకుని పర్యావరణానికి కూడా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే అవరోధంగా మారే అవకాశం ఉంది. వీవీపాలెం సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ కేవలం 50 కి.మీ దూరంలో రోడ్డు అలైన్మెంట్ ఉండటంతో నగర నిర్మాణానికి ప్రధాన ఆటంకంగా ఈ రోడ్డు మారనుంది. ఈ నేపథ్యంలో ఈ హైవేను గ్రీన్‌ఫీల్డ్‌కు బదులు బ్రౌన్‌ఫీల్డ్‌గా మార్చి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మహబూబాబాద్ వయా ఖమ్మం కోదాడ జాతీయ రహదారితో అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఇదే రోడ్డును బ్రౌన్ ఫీల్డ్ హైవేగా నిర్మించినప్పుడు తెలంగాణ- ఆంధ్రాలో గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి పూనుకోవడంపై నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి.
ప్రత్యామ్నాయ రోడ్డు ఉన్నా పంతం ఎందుకు?
ప్రత్యామ్నాయ మార్గంగా కోదాడ, ఖమ్మం, మహబూబాబాద్ రహదారి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం విలువైన భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండానే లాక్కోవాలని చూస్తోంది. ఇప్పటికే ఉన్న కురవి- కోదాడ రోడ్డును విస్తరిస్తే గరిష్టంగా 50 ఎకరాలు సేకరిస్తే సరిపోతాయి. సర్వీసు రోడ్లు సైతం ఉన్నాయి. దీనివల్ల ఓ 17 కి.మీ దూరం పెరిగినా ఖర్చు ఆదా అవుతుంది. 1100 ఎకరాల భూమి సేకరించాల్సిన అవసరం కూడా ఉండదని రైతులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్రీన్‌ఫీల్డ్ హైవేనే నిర్మించాలనే ఉద్దేశంలో ఉంది. అదీ తామిచ్చిన అలైన్మెంట్ ప్రకారమే ఏర్పాటు చేయాలని, ఎంతమంది వీధిన పడ్డా పర్వాలేదు కానీ కార్పొ'రూట్' మాత్రం 100 కి.మీ వేగంతో రవాణా వాహనాలు మాత్రమే వెళ్లేలా నిర్మించాలనే పంతంతో వ్యవహరిస్తోంది. నేషనల్ హైవే అధికారులు సైతం మొండిగా వ్యవహరిస్తూ రైతుల నుంచి బలవంతగానైనా భూములు లాక్కొనేందుకు 2019 నుంచి గెజిట్ల మీద గెజిట్లు విడుదల చేస్తూ ప్రజాభిప్రాయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా సమావేశాల్లో నిర్వాసితులు ముక్తకంఠంతో గ్రీన్‌ఫీల్డ్ హైవేను వ్యతిరేకిస్తున్నా 'డోన్ట్ కేర్' అనే రీతిలో కేంద్రం వైఖరీ ఉంది.
అరకొర పరిహారంతో సరిపెట్టే యత్నం..
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల మొదలు ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు మూడేండ్లుగా రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం సమీపంలోని రఘునాథపాలెం, రూరల్ మండలంలో భూముల విలువ ఎకరం రూ.60లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు మార్కెట్ వాల్యూ ఉంది. ఆ ప్రకారం భూముల పరిహారం చెల్లించాలని రైతులు కోరతున్నారు. కానీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూపై మూడు రెట్లు అధికంగా చెల్లిస్తామంటోంది. ఆ లెక్కన చూసినా వీవీ పాలెం వద్ద ఎకరం రూ.1.11 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. ఇటు కలెక్టరేట్ నిర్మాణం, అటు ధంసలాపురం ఆర్వోబీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకరం రూ.కోటికి పైగా చెల్లించింది. ఆ ప్రకారం గ్రీన్‌ఫీల్డ్ బాధితులకు చెల్లించాలని ఆర్బిటేటర్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కోరినా జాతీయ రహదారుల అధికారులు వినిపించుకోవడం లేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మొదలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా వరకూ గ్రీన్‌ఫీల్డ్ హైవే పొడవునా వేలాది మంది రైతులు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉన్న దృష్ట్యా భారీ ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అఖిలపక్ష రైతుసంఘం ఆధ్వర్యంలో నాగపూర్ టూ అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్వాసిత బాధితులు రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లా గంగదేవరపల్లిలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆందోళనలకు సమాయత్తం అవుతున్నారు.
పాదయాత్ర చేపట్టి ప్రతిఘటిస్తాం..
తెలంగాణలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితులందరం ఏకమయ్యాం. గంగదేవరపల్లిలో సమావేశం నిర్వహించాం. ఆదిలాబాద్ నుంచి ఏపీలోని కృష్ణాజిల్లా వరకూ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించాం. ప్రభుత్వ మొండివైఖరికి వ్యతిరేకంగా ఎంతటి పోరాటమైనా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే బీజేపీ పెద్దలందర్నీ కలిసి మొరపెట్టుకున్నాం. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం కూడా చూపించాం. ఇదే విషయమై పార్లమెంట్లో మాట్లాడాల్సిందిగా ఈ మార్గంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరికీ విన్నవిస్తున్నాం.
- టి. భద్రయ్య, గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితుల అఖిలపక్ష రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకులు