Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓఎంసీ కేసులో ఆరోపణలకు ఆధారాల్లేవు : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో క్లీన్చిట్ లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ సుమలత మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ అభియోగాలకు ఆధారాల్లేవని తేల్చారు. ఉమ్మడి ఏపీలో శ్రీలక్ష్మి 2004-09 మధ్యకాలంలో సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడు ఓఎంసీకి గనుల కేటాయింపుపై జీవో, నోటిఫికేషన్ జారీ చేయడంలో నిబంధనలకు వ్యతిరేకంగా గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగం మోపింది. గాలి జనార్దన్‌రెడ్డికి అనుకూలంగా చేయడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని సీబీఐ పదేండ్ల క్రితమే చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ కోర్టు విచారణ కూడా చేపట్టింది. దీనిని సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు గత అక్టోబర్ 17న కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అనుమతిస్తూ సీబీఐ అభియోగాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టకముందే ఓఎంసీ లీజుపై నోటిఫికేషన్ విడుదలైందని గుర్తు చేసింది. మైనింగ్ లీజు జీవోలో క్యాప్టివ్ మైనింగ్ అని పేర్కొనడం ఉద్దేశపూర్వకమైన కుట్ర అనేందుకు సీబీఐ వద్ద ఆధారాల్లేవనీ, కుట్ర, మోసం, అవినీతి వంటి అభియోగాలకు ఆధారాల్లేవని ఆమె వాదనను సమర్ధిస్తూ, సీబీఐ అభియోగాలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.