Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 77 కాలేజీల్లో వంద శాతం కేటాయింపు
- సెల్ఫ్రిపోర్టింగ్కు గడువు 13
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు మంగళవారం సాంకేతిక విద్యాశాఖ తొలివిడత కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫార్మసీ కోర్సుల్లో 9,062 సీట్లున్నాయని వివరించారు. వాటిలో 8,909 (98.31 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 153 (1.69 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఇందులో బీ ఫార్మసీకి సంబంధించి 116 కాలేజీల్లో 7,586 సీట్లుంటే, 7,433 (97.98 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 153 (2.02 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఫార్మా-డీకి సంబంధించి 60 కాలేజీల్లో 1,312 సీట్లుండగా వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. బయో మెడికల్ ఇంజినీరింగ్లో 10 సీట్లుంటే వందశాతం, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్లో 88 సీట్లుండగా వందశాతం, బయో టెక్నాలజీ కోర్సులో 66 సీట్లుంటే వంద శాతం భర్తీ అయ్యాయని తెలిపారు. సరిపోయినన్ని వెబ్ఆప్షన్లు నమోదు చేయకపోవడంతో 9,090 మంది అభ్యర్థులు సీట్లు పొందలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 617 మంది సీట్లు పొందారని వివరించారు. ఐదు విశ్వవిద్యాలయ, 72 ప్రయివేటు కలిపి మొత్తం 77 కాలేజీల్లో వందశాతం సీట్లు కేటాయించామని తెలిపారు. సున్నా ప్రవేశాలున్న కాలేజీ ఒక్కటి కూడా లేదని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేసేందుకు గడువు ఈనెల 13వ తేదీ వరకు ఉందని సూచించారు. ఇతర వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.