Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం
నవతెలంగాణ - వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా నుంచి వరంగల్ నగరానికి వస్తున్న ఇన్నోవా వాహనం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి డీసీతండా వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢకొీట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా వరంగల్ జిల్లా కేంద్రంలోని పెరికవాడలో నివాసముండే బిల్డర్ కృష్ణారెడ్డి, భార్య వరలక్ష్మి, కుమారుడు వెంకట సాయిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు క్షత్రగాతులను మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని రోడ్డుపై నిలపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎస్ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపుకునేందుకు కృష్ణారెడ్డి కుటుంబంతో కలిసి ఆయన సొంత గ్రామమైన ప్రకాశం జిల్లా శంకరాపురంనకు ఇన్నోవా కారులో వెళ్లి తిరిగి వస్తున్నారు. కాగా, వరంగల్ వైపు వెళ్తున్న లారీని ఎటువంటి ఇండికేటర్, పార్కింగ్ లెట్స్ వేయకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై డ్రైవర్ పార్కింగ్ చేశాడు. అదే సమయంలో సోమవారం తెల్లవారుజామున 4:30గంటల సమయంలో ఇన్నోవా వర్ధన్నపేట శివారు డీసీ తండా మూల మలుపు వద్ద నిర్లక్ష్యంగా పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢకొీట్టింది. కారులో ఎడమ వైపు కూర్చున్న ఇల్లారి కృష్ణారెడ్డి(45) వరలక్ష్మి(35), వెంకటసాయిరెడ్డి(14)కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో అరుగురికి స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇల్లారి రవీందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామారావు తెలిపారు.