Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావుకు ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లలో దంత వైద్యుల పోస్టుల సంఖ్యను పెంచాలని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు మంగళవారం ఆ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ మంజూర్ అహ్మద్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాయి వంశీ పాలకాయల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుకు లేఖ రాశారు. మనిషి ఆరోగ్యం ఆ వ్యక్తి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందనీ, ఆ ఆహారం జీర్ణం కావడం నోటి నుంచి మొదలవుతుందని చెప్పారు. నోటి ఆరోగ్యం బాగుంటే ఆ మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. అయితే మన సమాజంలో నోటికి సంబంధించిన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అవగాహన కల్పించడంలో దంత వైద్యులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉద్యోగ నియామక ప్రకటనల్లో దంత వైద్యులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దంత వైద్యులకు, ప్రజలకు మేలు జరిగేలా ప్రతి ప్రజా ఆరోగ్య కేంద్రంలో తమను నియమించాలని కోరారు. రాష్ట్ర జనాభా, రోగుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో ప్రభుత్వ దంత వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఒకే ఒక్క ప్రభుత్వ దంత వైద్య కళాశాల రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలు అందించలేకపోతున్నదని చెప్పారు. ఎండీఎస్ (పీజీ) సీట్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు దంత వైద్యకళాశాలల్లో చెల్లిస్తున్న జీతం, ఉపకారవేతనాలు తక్కువగా ఉంటున్నాయనీ, ప్రభుత్వ దంత కళాశాలలతో సమానంగా వాటిల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
దంత కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి...
హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని ప్రభుత్వ దంత వైద్యకళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా, పారిశుధ్యం, ఉపకారవేతనాల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. కాలేజీ నుంచి హాస్టల్కు ఉన్న అధికారిక బస్సు పాడైపోయిందనీ, వెంటనే మరమ్మతులు చేయించాలని పేర్కొన్నారు. వాటర్ ప్లాంట్ రిపేర్కు రావడంతో తాగునీటికి సమస్యగా ఉందని వివరించారు. ప్రతి రోజు నీటిని తెప్పించి సరఫరా చేయాలనీ, విద్యార్థుల కోసం వాష్ రూం నిర్మించాలనీ, ఉపకారవేతనాలు ప్రతి రోజు వచ్చేలా చర్యలు తసుకోవాలని విజ్ఞప్తి చేశారు.