Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈనెల 12న రామగుండంకు ప్రధాని మోడీ వస్తున్నారనీ, ఆ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానికి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, తెలంగాణ పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తక్షణమే తెలంగాణను వదిలి వెళ్లిపోవాలని కోరారు. బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈనెల 12న మోడీ పర్యటనను నిరసిస్తూ సింగరేణి ప్రాంత జిల్లాల్లో గురువారం నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామనీ, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఇలా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ఏ ఒక్క హామీనైనా కేంద్రం అమలు చేసిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని నిలదీశారు. త్వరలోనే రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తమిళి సై గవర్నరా? లేక బీజేపీ కార్యకర్తనా తేల్చుకోవాలని కోరారు. ఆమె గవర్నర్‌గా కాకుండా, బీజేపీ నేతగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఎనిమిది బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే వెనక్కి పంపించాలని సూచించారు. మంత్రులు వచ్చి రాయబారాలు జరిపితేనే వాటిని ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ పున్ణప్రారంభానికి వచ్చి, వరం అందించినట్టుగా మోడీ, బీజేపీ ఫోజు కొట్టేందుకేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి కాలరీస్ సంస్థను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు కుట్ర పన్నడాన్ని నిరసిస్తున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.సీతరామయ్య చెప్పారు. ''ప్రధాని మోడీ గో బ్యాక్ నినాదంతో అన్ని కార్మిక సంఘాలనూ కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలకు మోడీ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఈటి నరసింహా, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలరాజ్, ఉపాధ్యక్షుడు బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.