Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అబ్దుల్లాపూర్మెట్
అబ్దుల్లాపూర్మెట్ గ్రామ రెవెన్యూ సర్వే నెం.283లో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. వారికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో పేదలు వేసుకున్న గుడిసెల ప్రాంతాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. నివాసం లేని పేదలకు నివాస స్థలాలతోపాటు పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. అలాగే, ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలు 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే జులుం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. పేదలు వేసుకున్న గుడిసెలు న్యాయ బద్దమైనవన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఎ.భాస్కర్ రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు జి.శివ కుమార్, కనకయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి భిక్షపతి, నాయకులు సర్వయ్య, ప్రణరు, కిరణ్, యాదయ్య, మహిళలు అనితా, సౌజన్య, జీవిత, భాగ్యలక్ష్మి, పారిజాత తదితరులు పాల్గొన్నారు.