Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు : మహేష్‌కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర రాష్ట్రంలో విజయవంతమైందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకు సహకరించిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. యాత్ర జయప్రదం కావడంలో ప్రతి కార్యకర్త, నాయకుడి శ్రమ ఉందని పేర్కొన్నారు. ఈమేర మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 15 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 375 కిలోమీటర్ల మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా యాత్ర సజావుగా సాగిందని తెలిపారు. ప్రజాస్వామిక, స్వచ్ఛంద సంఘాలు, రైతు, మేధావులు, రైతులు, యువకులు, మహిళలు, విద్యార్థులు, కుల, మత సంఘాలు ఇలా అనేక సంఘాల ప్రతినిధులు రాహుల్‌కు మద్దతు ప్రకటించారని తెలిపారు. పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాత్రమే ఎదిరించి పోరాడుతున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. దేశ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తిరిగి తెచ్చేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని వివరించారు. మునుగోడులో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నంత మాత్రాన పార్టీ పనైపోయిందంటూ చెప్పడం సరైంది కాదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి అండ డబ్బుతో ఓటర్లను మాయ చేశాయని విమర్శించారు.