Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్యతో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయనీ, త్వరలో వాటిని పరిష్కరిస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మెన్ కే రాజిరెడ్డి నాయకత్వంలో సమాఖ్య ముఖ్య సలహాదారు బీజేఎమ్ రెడ్డి, కన్వీనర్ ఎమ్వీ చారి, వైస్ చైర్మెన్లు కత్తుల యాదయ్య, సుర్కంటి మోహన్‌రెడ్డి, కో కన్వీనర్లు కొవ్వూరు యాదయ్య, కంది రవీందర్‌రెడ్డి, డీ విద్యాసాగర్‌రెడ్డి, పీ యాదయ్య, బీ యాదగిరి, మోసిన్, ముత్యాలు, ఎన్ యాదయ్య తదితరులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి మునుగోడులో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలనూ ప్రస్తావించారు. దీనిపై మంత్రి పై విధంగా స్పందించారు. అంతకుముందు సమాఖ్య ప్రతినిధులు కుందన్‌బాగ్‌లో టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ నివాసంలో కలిసి అభినందించి, ప్రభుత్వ హామీలను గుర్తుచేశారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాఖ్య నాయకులు తెలిపారు.
కోడ్ ముగిసింది...హామీలు నెరవేర్చండి
టీజేఎమ్‌యూ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్
మునుగోడు ఉప ఎన్నికల కోడ్ ముగిసినందున తక్షణం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజరు కుమార్, జగదీశ్వర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి పలు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించడం, రెండు వేతన సవరణలు సహా అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయనీ, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.