Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టుల సహకారంతోనే మునుగోడులో గెలిచాం.. : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవ తెలంగాణ జనగామ
కేంద్ర బీజేపీకి చెప్పుతో కొట్టినట్టు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పారని పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల సహకారంతోనే టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు మంచి పట్టు ఉందన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించి గెలిపించారన్నారు. ఈ గెలుపు బీజేపీకి చెంపపెట్టుగా మారుతుందన్నారు. బీజేపీ మంత్రులు, నాయకులు వేల కోట్లు ఖర్చుపెట్టి మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చారన్నారు. ఇప్పటివరకు బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటికీ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువెళ్లలేదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అశాస్త్రీయంగా తెలంగాణకు చెందిన కొన్ని గ్రామాలు ఆంధ్రాలో కలిపారని వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇవన్నీ కాకుండా రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించిన నిధులను వాడుకోవడం తప్ప తిరిగి అభివృద్ధి నిధులను కేంద్ర ప్రభుత్వం పంపడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం మానేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధికి రాష్ట్ర బీజేపీ నాయకులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఇ రమణారెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బి.విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎడబెల్లి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పశువుల ఏబిల్, బి. సిద్ధిలింగం, ఎంపీపీ మేకల కలింగరాజు, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.