Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో కార్మిక సంఘాల నిరసన
- కార్మిక వాడల్లో నల్ల జెండాలు ఎగురవేయాలి
- ప్రయివేటీకరణ చర్యలను మోడీ సర్కారు ఉపసంహరించుకోవాలి
- నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి : కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి, విద్యుత్, ఎన్టీపీసీ, తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనీ, నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మోడీ గో బ్యాక్ నినాదంతో ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహించ నున్నట్టు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ పిలుపులో కార్మికులు, ఉద్యోగులు భాగస్వామ్యమై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వాడల్లో ఎక్కడికక్కడ నల్ల జెండాలు ఎగురవేయాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, ఏఐయూటీసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాలరాజు, వీఎస్ బోస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, జె.వెంకటేశ్, ఎం. వెంకటేశ్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య, శేషగిరి రావు, సీఐటీయూ నాయకులు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థలో నాలుగు బొగ్గు బావులను ప్రయివేటీకరించి ఉద్యోగుల పొట్ట గొడుతున్నదని విమర్శించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో బొగ్గు వెలికి తీస్తామనీ, 15 బావులకు అనుమతివ్వాలని వినతులు పెట్టుకున్నా కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడం దారుణ మన్నారు. అదే సమయంలో ప్రయివేటు సంస్థలకు మాత్రం బావుల తవ్వకానికి అనుమతి ఇస్తున్నదని విమర్శించారు. రూ. 3 వేల నుంచి 4 వేలకే టన్ను బొగ్గును కోలిండియా ఇస్తానంటున్నా.. .ఆస్ట్రేలియా లో ఆదానీ సంస్థ నుంచి రూ.10 వేలు వెచ్చించి కొనుగోలు చేయడం దారుణమన్నారు. ఇది దేశ ప్రజల సంపదను అదానీకి దోచిపెట్టడమేనన్నారు. విద్యుత్ సవరణ బిల్లుతో రైతాంగానికి, పారిశ్రామిక వేత్తలకు, ప్రజలకు తీవ్రమైన భారాలను మోప బోతున్నదని తెలిపారు. ఎన్టీపీసీలో ప్రయివేటీ కరణ చర్యలకు పాల్పడుతున్నదన్నారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. రాష్ట్ర విభజన సందర్భం గా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేరచ్చడంలో మోడీ సర్కారు పూర్తిస్థాయిలో విఫలమైందని విమర్శించారు. కార్మిక లోకానికి, రాష్ట్ర ప్రజానీకాని తీరని అన్యాయం చేస్తున్న మోడీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదన్నారు. రామగుండంలోని ఆర్ ఎఫ్‌సీఎల్ ప్రారంభించేందుకు వస్తున్న మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహి స్తామన్నారు. ఒక వేళ రాష్ట్రంలో పర్యటించాలను కుంటే దేశానికి ఆధునిక దేవాలయాల లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు తీరని అన్యాయం చేస్తూ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేలా ఉన్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరారు.