Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు
నవతెలంగాణ - మీర్ పేట్
హైదరాబాద్ మీర్పేట్లో బాలికపై సామూహిక లైంగికదాడి ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లెనిన్ నగర్‌కు చెందిన 13 ఏండ్ల బాలిక ఈ నెల 5వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి షాపునకు వెళ్ళింది. అదే సమయంలో 21 ఏండ్ల రతన్ అనే యువకుడు బైక్‌పై వచ్చి ఆ బాలికతో మాట్లాడాడు. బాలికను షాపు దగ్గర దించుతానని చెప్పి ఆమెను, మరో బాలుడిని బైక్‌పై ఎక్కించుకుని రాత్రి వరకు చుట్టుపక్కల తిప్పాడు. సుమారు రాత్రి 10గంటల సమయంలో లెనిన్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు బాలికను తీసుకెళ్లి ఆమెపై యువకుడు,
బాలుడు లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను భయపెట్టడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. అయితే 6వ తేదీన బాలికను తల్లిదండ్రులు రాత్రి ఎక్కడి వెళ్ళావని మందలించడంతో లెనిన్ నగర్ దగ్గర ఉండే ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని చెప్పింది. దాంతో బాలిక తల్లిదండ్రులు లెనిన్ నగర్ లోని డబుల్ బెడ్ రూం దగ్గరకు వెళ్లి అక్కడున్న ఓ యువకుడిని వీడియో కాల్లో చూపించి అతడేనా అని బాలికను అడిగారు. అతడే అని బాలిక చెప్పడంతో స్థానికులు ఆ యువకున్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. అయితే పోలీసుల విచారణలో అతను నిందితుడు కాదని తేలింది. బాలిక కూడా అబద్ధం చెప్పినట్టు ఒప్పుకుంది. అనంతరం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుడు రతన్ గతంలో చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని, అతనిపై నాలుగు దొంగతనం కేసులు ఉన్నాయని సీఐ చెప్పారు.