Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షౌరవృత్తిలోకి కార్పొరేట్ సంస్థల రాకపై ఆగ్రహం
నవతెలంగాణ- ఎల్బీనగర్
క్షౌరవృత్తిలోకి కార్పొరేట్ సంస్థలు రావడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ క్షౌరవృత్తిదారుల సంఘం పిలుపులో భాగంగా నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి శివాజీ విగ్రహం వద్ద నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు పి.ఆశయ్య మాట్లాడుతూ.. బడా కార్పొరేట్ సంస్థలు క్షౌరవృత్తిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అంబానీ వల్ల లక్షలాది మంది నాయీ బ్రాహ్మణుల ఉపాధి దెబ్బతింటుందని, వారు రోడ్డు మీద పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌తో ఇప్పటికే క్షౌరవృత్తి తీవ్ర ఇబ్బందులకు గురైందని.. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు రిలయన్స్ సంస్థ ఈ వృత్తిలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అంబానీ, అదానీల ప్రయోజనాలు కాపాడే విధంగా పాలకులు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. క్షౌరవృత్తిలోకి కార్పొరేట్ సంస్థలకు అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.