Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల విచారణకు తొలగిన అడ్డంకి
- గత మధ్యంతర ఉత్తర్వులు రద్దు
- పెండింగ్‌లో బీజేపీ పిటిషన్
- విచారణ 18కి వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్ల రూపాయల ఎర చూపించారన్న కేసు దర్యాప్తు విషయంలో వాయిదా స్టే ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను పెండింగ్‌లో పెడుతున్నట్టు ప్రకటించింది. ఇదే తరహాలో నిందితులు, ఇతరులు వేసిన రిట్లపై లోతుగా సమగ్రంగా విచారణ చేస్తామని చెప్పింది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తును ఎక్కువ రోజులు నిలిపివేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది. రిట్ పిటిషన్‌పై విచారణ జాప్యం చేయబోమని తెలిపింది. సమగ్రంగా లోతుగా, సత్వర విచారణ చేస్తామంది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి నిందితులపై కేసు విచారణ పురోగతిని వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి లేదా హైకోర్టు ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీకి ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారణ కొనసాగించింది. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆ కేసులోని నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్ (నందు), సింహయాజిలు దాఖలు చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఇతర ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. టెలికం యాక్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఫోన్ల ట్యాపింగ్ చేశారంటూ దాఖలైన రిట్‌ను కూడా కలిపి విచారణ చేస్తామని చెప్పింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
పోలీసుల కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వ వాదనను ఆమోదించింది. దర్యాప్తును నిలుపుదల చేయాలని పిటిషనర్ కోరలేదనీ, ఆ విధమైన ఉత్తర్వుల జారీ చేయడానికి వీల్లేదని ఆది నుంచీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదిస్తున్నారు. దర్యాప్తు వాయిదా ఉత్తర్వుల కారణంగా నిందితులు ముగ్గురినీ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేసేందుకు వీల్లేకుండా ఉందన్నారు. పిటిషనర్ స్టే కోరనప్పుడు దర్యాప్తును వాయిదా వేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. క్రిమినల్ కేసులో నిందితులు కాని వాళ్లు ఆ కేసు వ్యవహారంపై రిట్ పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదన్నారు. బీజేపీ వేసిన రిట్‌కు విచారణార్హత లేదన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరు లేదనీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఏ హౌదాలో రిట్ దాఖలు చేశారో అర్ధం కావడం లేదన్నారు. రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన ఉత్తర్వుల్లోగానీ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లోగానీ పిటిషనర్ పేరు లేదా బీజేపీకి చెందిన ఇతరుల పేర్లు కూడా ల్లేవన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించిన కేసులోని నిందితులపై పిటిషనర్‌కు ప్రేమ ఎందుకో తెలియడం లేదన్నారు. నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్ (నందు), సింహయాజిలపై బీజేపీ ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ రిట్ వెనుక ఆ పార్టీకి ఉన్న ప్రత్యేక ప్రేమ ఏపాటిదో తెలుస్తోందన్నారు. నిందితులతో సంబంధం లేని వ్యక్తి లేదా పార్టీ రిట్ దాఖలు చేస్తే దానిని హైకోర్టు విచారణ చేయకూడదని అన్నారు. బీజేపీ రిట్‌కు విచారణార్హత లేదన్నారు. మొయినాబాద్ ఫాంహౌస్‌లో నిందితులు పట్టుబడిన తర్వాత పోలీసులు పంచనామా, వస్తువుల సేకరణ చేశాక దర్యాప్తు మొదలౌతుందనీ, దర్యాప్తు ప్రారంభానికి ముందే పిటిషనర్ దర్యాప్తు ఏకపక్షంగా ఉందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నెలరోజులకుపైగా నిందితులు, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఒకో ఎమ్మెల్యేకు కోట్ల రూపాయలు ఇస్తామని ఎర వేశారనీ, బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ వంటి కేసులు ఉండబోవని లేదంటే సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కుంటారని భయపెట్టారని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాది ప్రభాకర్ చెప్పారు. బీజేపీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సీఎం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడిన మాటలను తీవ్రంగా పరిగణించాలని కోరారు. రిట్‌కు విచారణార్హత ఉందన్నారు. రామచంద్రభారతి, కోరె నందకుమార్ (నందు), సింహయాజి తరఫున కర్నాటక మాజీ ఏజీ, సీనియర్ న్యాయవాది ఉదయ హళ్లి వాదిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు దర్యాప్తునకు ముందే పోలీసులు ఆ కేసు వివరాల గురించి విలేకరుల సమావేశాన్ని నిర్వహించకూడదన్నారు. ఈ కేసులో పోలీసులే కాకుండా సీఎం కూడా విలేకరుల సమావేశంలో అనేక విషయాలు చెప్పడంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేశారని చెప్పారు. పోలీసులు మొయినాబాద్ ఫాం హౌస్‌కు వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్ల రూపాయల ఎర వేశారని చెప్పారని తెలిపారు. ఈ ఒక్క అంశం ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయవచ్చునని చెప్పారు. విలేకరుల సమావేశాన్ని బట్టి కేసు దర్యాప్తు ఏకపక్షంగా ఉంటుందని స్పష్టం అవుతోందన్నారు. బీజేపీకి రిట్ దాఖలు చేసే అర్హత ఉందన్నారు. సోమవారం జరిగిన పై వాదలను హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీసుల దర్యాప్తుపై స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.