Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
- బీసీడబ్ల్యూఎఫ్ జాతీయ అధ్యక్షులు సుఖ్బీర్ సింగ్
- మానుకోటలో భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభ
నవతెలంగాణ - చిన్నగూడూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరళీకృత విధానాల వల్ల నిర్మాణరంగం కుదేలైందని, కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీసీడబ్ల్యూఎఫ్ (తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్) జాతీయ అధ్యక్షులు సుఖ్బీర్సింగ్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, బీసీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు విమర్శించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాజగోపాల్ ప్రాంగణంలో బీసీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర మూడవ మహాసభలు నిర్వహించారు. కాగా భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన ర్యాలీతో మానుకోట దారులన్నీ ఎరుపెక్కాయి. గాంధీ పార్క్ నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారులు, మహిళలు, కర్ర నృత్యాలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజగోపాల్ ప్రాంగణంలో వంగూరు రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందన్నారు. సోషలిస్టు దేశాలైన చైనా, క్యూబా లాంటి దేశాల్లో కరోనాను ప్రతిష్టాత్మకంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలు కాపాడారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానానికి అనుకూలంగా ఉండి అంబానీ, ఆదానీల కోసం రెడ్ కార్పెట్ పరుస్తోందన్నారు. అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే 1926లో కేంద్ర సమగ్ర చట్టం ఏర్పడిందని చెప్పారు.
కార్మిక కుటుంబాలు బతకాలంటే కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు భగత్ సింగ్ వారసుల్లాగా ఐక్యతతో ముందుకొచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యం కావాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు కుంట ఉపేందర్, ఆకుల రాజు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు శంకర్, సూర్ణపు సోమయ్య, బీసీడబ్ల్యూయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు శ్రీశైలం, కోటేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రఘు, రామ్మోహన్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.