Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు
- 80 శాతం సబ్సిడీపై ఆధునాతన పనిముట్లు
- నవీన పద్ధతులపై శిక్షణ
నవతెలంగాణ - కందనూలు
అంతరించి పోతున్న వృత్తుల్లో కుమ్మరి వృత్తి ఒకటి.. అలాంటి కుమ్మరుల జీవన ప్రమాణాల మెరుగుదల.. ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది.. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందిస్తుంది.. 80 శాతం సబ్సిడీపై కుమ్మరులకు అధునాతన పనిముట్లు, యంత్రాలు, ముడి సరుకులు అందిస్తోంది. దాంతోపాటు యువతకు నవీన నైపుణ్యాలపై శిక్షణ కూడా ఇస్తోంది.
నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి వృత్తిదారులకు మోడ్రన్ పాటరీ కిన్లను ప్రభుత్వం సబ్సీడీపై అందిస్తున్నది. శిక్షణ పూర్తి చేసుకకున్న 9 మంది కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక పాటరీ యంత్రాలను ఇటీవల మంజూరు చేసింది. వీటి కొనుగోలుకయ్యే రూ.లక్ష ఖర్చులో రూ.80 వేలను ప్రభుత్వమే సబ్సిడీగా ఇచ్చింది. జిల్లాలో సుమారు 5,600 కుమ్మరి కుటుంబాలు ఉన్నాయి.
ఇందులో కొన్ని కుటుంబాలు కుల వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతున్నాయి. కుండలు, రంజన్లు, మట్టి పాత్రలు తయారు చేస్తూ విక్రయిస్తుంటారు. పాత్రల తయారీకి అవసరమైన మట్టితోపాటు ఇతర ముడిసరుకులు, పరికరాల కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో రుణాల కోసం 2018లో కుమ్మరి సామాజిక తరగతి యువకులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తొమ్మిది మందికి
పాతకాలం నాటి పద్ధతులు అనుసరిస్తూ పాత్రలు చేసే కుమ్మరి/శాలివాహన వృత్తిదారులకు నవీన నైపుణ్యాలపై ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. కుమ్మరి కులసంఘాల నాయకులతోపాటు యువతకు నాలుగు రోజులపాటు హైదరాబాదులోని రామానందతీర్థ సంస్థ వారు శిక్షణ ఇచ్చారు. ఇందులో నాగర్‌కర్నూలు జిల్లా నుంచి 9 మంది కుమ్మరి వృత్తిదారులకు వివిధ రకాల మట్టిపాత్రల తయారీలో శిక్షణ ఇప్పించారు. వీరు జిల్లాలో మరికొంత మందికి శిక్షణ ఇచ్చారు. తాజాగా అధికారులు రెండో విడత యంత్రాలు అందించేందుకు దరఖాస్తులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు.
తొలి విడతగా 9 యూనిట్లు మంజూరు
జిల్లాలో తొలి విడతగా 9 యూనిట్లు పంపిణీ చేయడానికి మంజూరయ్యాయి. రూ. లక్ష స్వయం ఉపాధి రుణాన్ని అందించనున్నారు. ఇందులో రూ.80 వేలు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. రూ.20 వేలను లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా కుమ్మరి వృత్తులకు అవసరమైన పనిముట్లు, ఆధునిక యంత్రాలు, ముడి సరుకును అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టైప్-1, టైప్-2ల వారీగా యూనిట్లను కేటాయిస్తున్నారు. టైప్-1లో రూ.లక్ష విలువ గల అధునాతన పగ్ మిల్ యంత్రం, 100 కేవీ కెపాసిటీ గల బ్లెంజర్, టూల్ కిట్, 1 హెచ్‌పీ మోటార్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ యంత్రాన్ని అందించనున్నారు. టైప్- 2లో రూ.లక్ష విలువ గల కుండలు, గ్లాస్‌ల తయారీకి సంబంధించిన డైమేకింగ్ మిషన్లు, 100 ఎంఎల్ టీకప్ డైలు, బుండి మిషన్‌ను అందించనున్నారు.
మట్టి పాత్రలకు పెరిగిన డిమాండ్
శుభకార్యాలకు, పెండ్లికి కుండలు, గౌరీ దేవి నోము పాత్రలు, చల్లని నీటి కోసం రంజన్లు, తాబేలు బుర్ర, కూజలు, నీళ్ల కుండలు, దీపాలంకరణ కోసం చిప్పలను వినియోగిస్తున్నారు. మట్టి పాత్రల్లో పాతకాలంలో వంట చేసేవారే. ఇప్పుడు మళ్లీ ప్రజలు ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు. అలంకరణ వస్తువుల కోసం కూడా మట్టి పాత్రలను విరివిగా ఉపయోగిస్తున్నారు. కుమ్మరి వృత్తి కళాకారుల జీవన పరిణామాలు పెంచడానికి బీసీ సంక్షేమ శాఖ జిల్లాలో చర్యలు తీసుకుంటుంది.
మరింత మందికి రుణాలు
కుమ్మరి వృత్తి వారికి స్వయం ఉపాధి రుణాలను మరింత మందికి అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 9మంది లబ్దిదారులకు అందించి, యూని ట్లను గ్రౌండింగ్ చేస్తున్నాం. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజక వర్గం నుంచి వచ్చిన లబ్దిదారులకు అందించాం. ఒక్కో యూనిట్ కింద రూ.లక్ష రుణం అందించనున్నాం. ఇందులో రూ.80 వేల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మార్కెటింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం.
- యం.అనిల్ ప్రకాష్, నాగర్ కర్నూలు జిల్లా
వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి శాఖాధికారి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు
కుల వృత్తులను ప్రోత్సహించ డానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు. శిక్షణ పొందిన 9 మందితో జిల్లాలో ఇతర కుమ్మరులకు శిక్షణ అందిస్తాం. అర్హులైన కుమ్మరి యువజను లందరికీ స్వయం ఉపాధి రుణాలు అందిం చాలి. ఇందుకు అనుగుణంగా అధికారులు దరఖాస్తులు స్వీకరించాలి. అవసరమైన పక్షంలో వృత్తి శిక్షణను సైతం అందరికీ అందించాలి.
- ఊరుకోండ రఘబాబు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు