Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట
- గ్రామస్తుల తీవ్ర ప్రతిఘటనతో వెనుదిరిగిన అధికారులు
నవ తెలంగాణ-రాయపోల్
నిజాం జాగీర్దార్‌కు చెందిన 20 ఎకరాల భూమిని అక్రమంగా వారసులను సృష్టించి అమ్మేశారు. కాలం గడిచిన కొద్దీ ఆ భూమి చేతులు మారుతోంది. 25 ఏండ్లుగా భూమి కోసం గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. బుధవారం ఆ భూమిని సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో సర్కార్ తోట భూమి వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని సర్వే పనులను అడ్డుకున్నారు. సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసు బెటాలియన్ సర్వే నిర్వహించడానికి వచ్చినప్పటికీ ప్రజలు వెనుకడుగు వేయలేదు. పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామస్తులంతా ఏకతాటిపై నిలబడి సర్వేను అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు చేసేదేమీలేక వినుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. రాయపోల్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 720లో 15 ఎకరాల 20 గుంటలు, సర్వే నంబర్ 1391లో 5 ఎకరాల భూమి ప్రస్తుతం మాధవచారి అనే ప్రయివేటు వ్యక్తిపై రిజిస్ట్రేషన్ అయి ఉందన్నారు. చట్టం ప్రకారం అతడు పట్టాదారుగా కొనసాగుతున్నాడని తెలిపారు. అతను మరో వ్యక్తి జలంధర్‌రెడ్డికి ఆ భూమిని అమ్ముకున్నా డన్నారు. వివాదాస్పదమైన 5 ఎకరాల భూమిని జలంధర్‌రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం ఇస్తున్నట్టుగా గవర్నర్ పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారని చెప్పారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలం లేనందున ఐదు ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తున్నట్టు జలంధర్‌రెడ్డి ప్రకటించుకున్నారని తెలిపారు. గతంలో గ్రామస్తులకు ముందు కొను గోలు చేసిన భూ యజమాని 7 ఎకరాలు రాసి ఇచ్చారన్నారు. ఇప్పుడు 7 ఎకరాల భూమి, ప్రభుత్వ కార్యాలయల కోసం గవర్నర్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసిన 5 ఎకరాలు మొత్తం 12 ఎకరాలు ఇచ్చిన తర్వాతనే సర్వే నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
నిజాం పాలన, జాగీర్దార్ వ్యవస్థ ముగిసిన తర్వాత ఆ భూమి గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతోందన్నారు. ఆ భూమిలోని మామిడి తోట, చింత తోట పండ్లను గ్రామస్తులే అనుభవించారన్నారు. భూమికి సంబంధించిన శిస్తు, పన్నులు మాత్రం గ్రామ పంచాయతీ తరపున చెల్లిస్తున్నారని తెలిపారు.
ఆ భూమిలో గ్రామస్తులు కష్టపడి పనిచేసి మొక్కలను నాటి చెట్లుగా పెంచారన్నారు. నిజాం జాగీర్దార్‌కు వెట్టిచాకిరీ చేస్తూ భూమిని కాపాడుకుంటూ వచ్చామన్నారు. కొందరు అక్రమార్కులు జాగీర్దార్ మరణాంతరం వారికి వారసులు లేకున్నా అక్రమంగా వారసులను సృష్టించి వారి పేరు మీదు కాగితాలను సృష్టించి ప్రయివేటు వ్యక్తులకు విక్రయించారని తెలిపారు. 2004 నుంచి ఆ భూమి కోసం గ్రామస్తుందరం పోరాడుతుంటే.. అక్రమంగా కొనుగోలు చేసిన ప్రయివేటు వ్యక్తి కోర్టును ఆశ్రయించి తమపైనే కేసులు నమోదు చేయించాడన్నారు. ఆ భూమిని ఎంత మందికి విక్రయించాలని చూసినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్ని రోజులకైనా సర్కార్ తోట భూమి గ్రామస్తులకే చెందుతుందని తెలిపారు.