Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి సోదాలు
- గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో రోజంతా తనిఖీలు
- స్థానిక పోలీసులకూ సమాచారం ఇవ్వకుండా రంగంలోకి..
- ఏకకాలంలో హైదరాబాద్, కరీంనగర్ కేంద్రంగా 30బృందాలు దాడులు
నవతెలంగాణ- కరీంనగర్/ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్, ఖమ్మ జిల్లాల్లో ఐటీ, ఈడీ సోదాలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. సుమారు 30 బృందాలు వివిధ సంస్థల కార్యాలయాల్లో ఏకకాలంలో బుధవారం సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్, కరీంనగర్ గ్రానైట్ వ్యాపార సంస్థలపై సాగిన ఈ దాడుల్లో ప్రజాప్రతినిధులు, పలువురు నాయకుల ప్రమేయంపైనా విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. జిల్లాలోని గ్రానైట్ వ్యాపారంపై స్థానిక ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు నేపథ్యంలో గతంలోనే సోదాలు నిర్వహించిన ఐటీ, ఈడీ సంస్థలు విచారణ చేపట్టకుండానే వెనక్కివెళ్లాయి. కారణాలు తెలియకపోయినా తాజాగా హైదరాబాద్‌కు చెందిన శేఖర్‌రావు అనే వ్యక్తి ఫిర్యాదుతో మరోసారి ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ఈ సోదాలు జరుగుతున్న సమయంలో ఆ గ్రానైట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్ దుబాయ్ టూర్లో ఉండటం గమనార్హం. దాంతో ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి సోదాలు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా జిల్లా నుంచి వెళ్లిన పెద్ద బండరాళ్లను కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ సమయంలో పలు సంస్థలు తరలించిన రాయి పరిమాణాన్ని తక్కువ కొలతలు తీసి అక్రమాలకు పాల్పడ్డారని అప్పట్లో ఫిర్యాదులున్నాయి. ఆ రాయి ఎగుమతుల్లో డొల్లతనం 2013లో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఆ సందర్భంలో ఆయా గ్రానైట్ సంస్థలకు రూ.124.94కోట్ల జరిమానా విధించారు. అయితే, ఈ ఫెనాల్టీని ఐదింతలుగా రూ.749కోట్లు చెల్లించాలని ఆదేశించారు. ఈ క్రమంలో కొందరు గ్రానైట్ సంస్థల యజమానులు కోర్టుకు వెళ్లి కొంత ఫెనాల్టీ చెల్లించారు. మరికొందరు రూపాయి కట్టకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ ఈ ఫెనాల్టీపై ఈడికి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై రోజుల వ్యవధిలోనే హడావిడి చేసి విచారణ మధ్యలోనే ఆగిపోయింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎంపీకి పెద్దమొత్తంలో ముడుపులు అందాయన్న వార్తలు గుప్పుమన్నాయి. ఏకంగా సంజయ్ పార్టీలోని కొందరు పెద్దలే ఈ విషయమై నిజమేనంటూ అక్కడక్కడా మాట్లాడటం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన శేఖర్‌రావు ఫిర్యాదుతో మరోసారి ఐటీ, ఈడీ సంస్థలు సోదాలకు దిగాయి. అయితే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఈడీ అధికారులు ఒక్కసారిగా దాడులు చేయడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు వుండి ఉండొచ్చా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ కేంద్రంగా ఉన్న గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో బుధవారం ఏకకాలంలో దాడులకు దిగాయి. సుమారు 30బృందాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్దగ్గర అరవింద్ వ్యాస్, మంకమ్మతోటలోని శ్వేతాగ్రానైట్స్, కరీంనగర్ శాస్త్రీ రోడ్డులోని గ్రానైట్ వ్యాపారి పాగన్ వాలియా ఇంట్లోనూ సోదాలు ముమ్మరంగా సాగాయి. హైద రాబాద్‌లో కూడా వీరికి చెందిన కార్యాలయా ల్లో సోదాలు చేశారు. ఈ సోదాలపై స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం, ఈడీ అధికారులు సైతం దీనిపై ఎలాంటి సమాచారమూ మీడియాకు ఇవ్వకుండా ఇంకా విచారణ చేస్తున్నారు.
దర్యాప్తు సంస్థలకు సంపూర్ణ సహకారం
మంత్రి గంగుల కమలాకర్
'దర్యాప్తు సంపూర్ణంగా చేయండి. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. అందుకు నేను సంపూర్ణ సహకారం అందిస్తాము' అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఖమ్మంలో ఐటీ దాడులు.. ఆస్పత్రుల్లో కలకలం
ఖమ్మంలో బుధవారం ఆదాయ పన్నుశాఖ (ఐటీ) అధికారుల దాడులు కలకలం రేపాయి. ఉదయం 10 గంటల సమయంలో నగరంలోకి ప్రవేశించిన ఐటీ అధికారులు ఆస్పత్రులపై దృష్టి కేంద్రీకరించారు. ఖమ్మం వైరా రోడ్డులోని బిలీఫ్ హాస్పిటల్ నుంచి మొదలైన ఈ దాడులు రోహిత్ టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్, బాలాజీనగర్‌లోని శ్రీరాం కిడ్నీ సెంటర్, పెవిలియన్‌గ్రౌండ్ సమీపంలోని జీవన్ హాస్పిటల్స్‌పై కొనసాగాయి. బిలీఫ్ ఆస్పత్రిలోకి ఉదయం 10 గంటల సమయంలో వెళ్లిన ఐటీ అధికారులు రాత్రి 7 గంటల వరకూ సోదాలు నిర్వహించారు. బిలీఫ్ ఆస్పత్రి నిర్వాహకులకే చెందిన రోహిత్ టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్లో కొందరు తనిఖీలు చేపట్టారు. ఐటీ అధికారుల సమాచారంతో అప్రమత్తమైన బిలీఫ్ ఆస్పత్రి నిర్వాహకులు ముఖ్యమైన ఫైల్స్, హార్డ్‌డిస్క్‌లను దొడ్డిదారిలో వెనుక భాగం నుంచి తరలించడం మీడియా కంటపడింది. వీటిని ఆస్పత్రి పీఆర్వో ఇంటికి తరలించినట్టు సమాచారం. సంతాన సాఫల్య కేంద్రం, ఆపరేషన్ లేకుండా కాన్పుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్న బిలీఫ్ ఆస్పత్రిపై ఇప్పటికే భారీగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు ఈ ఆస్పత్రిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. శ్రీరాం కిడ్నీ సెంటర్, జీవన్ హాస్పిటల్లోనూ ఐటీ దాడులు కొనసాగినా రెండు, మూడు గంటల్లో ముగిశాయి. కానీ బిలీఫ్ ఆస్పత్రిలో దాదాపు 9 గంటలు ఐటీ అధికారులు సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం దాడులు కొనసాగిన నేపథ్యంలోనే ఖమ్మంలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక్కడికి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారుగా భావిస్తున్నారు.