Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ వ్యవస్థను కమ్యూనిస్టులు ఎప్పుడో వ్యతిరేకించారు
- మునుగోడు ఫలితం కోసం యావత్తు దేశం ఎదురు చూసింది
- 12న రాష్ట్రానికి మోడీ ఎందుకు వస్తున్నారు..?
- ఎప్పుడో ప్రారంభమైన ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభిస్తారా..
- రాష్ట్రంలో గవర్నర్ బీజేపీకి వత్తాసుగా పనిచేస్తున్నారు: తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మునుగోడు
''మునుగోడు ఎన్నికల ఫలితం కోసం రాష్ట్రమే కాకుండా యావత్తు దేశం ఎదురు చూసింది.. ఈ ఫలితంతో మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు.. 12న రాష్ట్రానికి మోడీ ఎందుకు వస్తున్నారు..? ఎప్పుడో ప్రారంభమై ఉత్పత్తి జరుగుతున్న ఫ్యాక్టరీని కొత్తగా ప్రారంభించేదేముంది.. గవర్నర్ బీజేపీకి వత్తాసుగా మాట్లాడుతున్నారు.. గవర్నర్ వ్యవస్థను కమ్యూనిస్టులు ఎప్పుడో వ్యతిరేకించారు'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని సత్య ఫంక్షన్ హాల్లో సీపీఐ(ఎం) మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. అవకాశవాదంతో అవినీతి భాగోతంతో ముందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డిని ప్రజలు తన్నితరిమే విధంగా ఉప ఎన్నికల్లో తీర్పు ఇచ్చారన్నారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఈ తీర్పు ఈ ఎన్నికల వరకే కాకుండా ఎన్నికల అనంతరం కూడా కొనసాగాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రజల్లోకి ఎక్కిస్తున్న మతోన్మాద భావజాలాలను.. ప్రజల నుంచి బయటకు తీసుకొచ్చే వరకు నిరంతరాయంగాఉద్యమాలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించే విధంగా ధరల పెరుగుదల, ఆర్థిక కుంభకోణాలు చేస్తూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్లోందని, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం), సీపీఐతో కలిసి రాబోయే కాలంలో పోరాడేందుకు సీఎం కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
''ఈనెల 12న తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు వస్తున్నారో తెలుసా..? రామగుండంలో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి కాదు.. అది గత సంవత్సరమే ప్రారంభమై వేల టన్నుల ఎరువుల ఉత్పత్తి చేస్తోంది.. అంతేకాదు రూ.87 కోట్ల లాభం వచ్చిన ఫ్యాక్టరీని ఇప్పుడు మోడీ వచ్చి ప్రారంభించేది ఏముంది'' అని ప్రశ్నించారు. కేవలం బీజేపీ మునుగోడులో గెలుస్తామని అంచనాలు వేసుకొని ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామ్ అని చెప్పారు. మోడీ పర్యటనపై నిరసన తెలియజేయనున్నట్టు తెలిపారు. కాషాయమూకలకు, మతోన్మాద ఎజెండాకు తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదని మునుగోడు ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారన్నారు. దేశంలో ఇతర రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ వేలాది కోట్ల రూపాయలతో కుట్ర పన్నుతున్నదన్నారు.
అదే తరహాలో ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిందని చెప్పారు. ఆ దుర్బుద్ధితోనే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా నలుగురు ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని, దాన్ని రాష్ట్ర పోలీసులు తిప్పి కొట్టారని తెలిపారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా ఎన్నో కుట్రలు చేసిందన్నారు. తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పనితీరు బాలేదన్నారు. గవర్నర్ వ్యవస్థను కమ్యూనిస్టులు ఎప్పుడో వ్యతిరేకించారని, ఈ దేశానికి గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని చెప్పారు.
మునుగోడులో బీజేపీ కుట్రలు భగం
చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి
రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేసేందుకు మునుగోడుకు ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ కుట్రలను ప్రజలు భగం చేశారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీతో ఇక ప్రమాదం లేదని నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కనపడకుండానే వందల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇక్కడ తిష్టవేశారని చెప్పారు. టీఆర్ఎస్ గెలిస్తే రజాకార్ల కాలం మళ్లీ వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇలాంటి ప్రచారాలతో ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, దోనూరి నర్సిరెడ్డి, ఎండి. హాషం, పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.