Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ నోటివెంట బీజేపీ మాటలు
- రాష్ట్ర ప్రభుత్వంపై విసుర్లు
- 'మునుగోడు'.. ప్రధాని రాకపై నిరసనల నేపథ్యంలో మాటల యుద్ధం
- సాంప్రదాయాలకు భిన్నంగా బిల్లులపై లొల్లి
- చర్చించేందుకు సిద్ధమంటున్న సర్కార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకవైపు మునుగోడు ఉప ఎన్నికలో పరాభవం.. మరోవైపు ప్రధాని మోడీ రాకపై తీవ్ర నిరసనలు... వెరసి తీవ్రమైన నైరాశ్యంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కొంగొత్త తతంగానికి తెరలేపింది. ఆ రెండు అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఆ పార్టీ నేతలు... తమ మనసులోని మాటలను గవర్నర్ తమిళసై నోటి ద్వారా బయటపెట్టుకుంటున్నారు.
కమలం పార్టీ ఢిల్లీ పెద్దల ఆదేశాలు, మార్గదర్శకాలకనుగుణంగా ఆమె రాష్ట్ర రాజకీయాల్లో 'తనదైన' పాత్రను పోషిస్తున్నారనే వాదనలు ఇప్పుడు బలంగా వినబడుతున్నాయి. ఈ క్రమంలో విశ్వ విద్యాలయాల బిల్లును సాకుగా చూపి... గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో సైతం గవర్నర్ ఇదే రకంగా వ్యవహరించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆమె ఎమ్మెల్యేల బేరసారాలు, మొయినాబాద్ ఫామ్‌హౌస్, దానిపై సుప్రీంకోర్టు గురించి ప్రస్తావించటం ద్వారా ఫక్తు రాజకీయ నేతగా వ్యాఖ్యానించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులను ఆమోదించేందుకు ఎలాంటి కాలపరిమితి లేదంటూ ఆమె మాట్లాడటం వివాదస్పందగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివిధ బిల్లులపై ఎలాంటి సందేహాలు, అనుమానాలున్నా వాటిని నివృత్తి చేసుకోవచ్చు.. లేదంటే ప్రభుత్వానికి తిప్పి పంపిచొచ్చు.. ఈ రెండూ కాకపోతే రాష్ట్రపతికి కూడా పంపించుకోవచ్చని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు భిన్నంగా గవర్నర్ ఏడు నెలలపాటు వాటిని తొక్కిపట్టటం సరికాదని వారు చెబుతున్నారు. మరోవైపు కేరళ, తమిళనాడు గవర్నర్ల వ్యవహారశైలి తర్వాత ఇప్పుడు వారి బాటలోనే తమిళిసై వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారమంతా 'గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్' అనే విధంగా మారింది.