Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం పేరుతో ఈనెల 12న ప్రధాని రాక
- రాజకీయ ఎత్తుగడేనంటున్న విపక్షాలు
- ఏడాదిన్నర నుంచే ఉత్పత్తులు ప్రారంభించిన ఫ్యాక్టరీ
- పక్కనున్న కోల్‌ను ప్రయివేటుపరంజేసి..
- స్థానికుల ఉద్యోగాల పేరుతో కర్మాగారం పునరుద్ధరణ నుంచీ నయవంచన
- ఏడాదికే రోడ్డునపడి ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు
- 'మోడీ గో బ్యాక్' నినాదాలతో అడ్డుకునేందుకు సిద్ధమైన పార్టీలు
- ప్రధాని పర్యటన ఏర్పాట్లలో నిమగమైన కేంద్ర మంత్రి సహా అధికారయంత్రాంగం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసేందుకు ఈ నెల 12న మోడీ రాబోతున్నారు. ఏడాదిన్నర కిందట పునరుద్ధరణ పూర్తి చేసుకుని దేశవ్యాప్తంగా ఉత్పత్తులూ సరఫరా చేస్తున్న ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభిస్తామంటూ ప్రధాని వస్తున్న తీరుపై సర్వత్రా సందేహాలు అలుముకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ హవాకు బ్రేకులు పడుతుండటం.. ఇటీవల అధికారపార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ బెడిసి కొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో 'పెండ్లయిన ఏడాదికి ఇప్పుడు బజాలా' అంటూ ప్రధాని రాకపట్ల విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇది కచ్చితంగా రాజకీయ ఎత్తుగడలో భాగమేనంటూ భగ్గుమంటున్నాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా..
కాంట్రాక్టు పద్ధతిలో ఇచ్చిన ఉద్యోగాలూ ఊడదీసిన కేంద్రం నయవంచన పట్ల ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. మరోవైపు పక్కనేనున్న కోల్‌ను ప్రయివేటుపరం చేసి.. ఆర్ఎఫ్సీఎల్ పేరుతో ఏం సందేశం ఇస్తారంటూ విపక్ష రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. 'మోడీ గో బ్యాక్' అన్న నినాదాలతో ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో మూతబడిన ఆర్ఎఫ్సీఎల్ను రూ.6888.18కోట్లతో కేంద్రం పునరుద్ధరించింది. ఇందులో రాష్ట్ర వాటాగా 11శాతం నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకు ఫ్యాక్టరీ ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సర్కారు రూ.199కోట్లు కేటాయించగా.. అందులో ఇప్పటికే రూ.154.4కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన రూ.44.95కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణ పూర్తి చేసుకుని ఇప్పటికే 10లక్షల 17వేల 512 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేసింది. 2021 మార్చి 22 నుంచే పూర్తిస్థాయిలో తన వాణిజ్య కార్యకలాపాలనూ నిర్వహిస్తోంది.
నయవంచనకు కేరాఫ్‌గా ఆర్ఎఫ్సీఎల్
1970 నుంచి నిర్విరామంగా నడిచిన ఎఫ్‌సీఐ (ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్)ని నాటి పాలకులు నష్టాల పేరుతో 1999లో మూయించారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బలవంతంగా రోడ్డున పడేశారు. 2013జులైలో బీఐఎఫ్ఆర్ అనుమతితో ఇదే ఫ్యాక్టరీని ఆర్ఎఫ్సీఎల్ పేరుతో పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ఫ్యాక్టరీ తొలినాళ్లలో పని చేసిన మాజీ కార్మికులతోనే పునరుద్ధరణ పనులు చేయించుకున్నారు. తీరా ఫ్యాక్టరీకి ఓ రూపువచ్చిన సమయంలో ఉద్యోగాలు ఇవ్వకుండా మొఖం చాటేసింది. ఫ్యాక్టరీలోని ప్రధాన విభాగాలను కాంట్రాక్టు కంపెనీలకు అప్పగించి పర్మినెంట్ ఉద్యోగాలన్నీ స్థానికేతరులకు ఇచ్చింది. దీంతో జిల్లా ప్రజానీకం భగ్గుమనడంతో 2020 ఫిబ్రవరిలో ఎంత మంది మాజీ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారో గ్రామాల వారీగా లెక్కలు తీసింది. ఫ్యాక్టరీకి మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసేందుకు ఒక ప్రముఖ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుని 798 మందిని పనుల్లోకి తీసుకుంది. ఏడాదికి కాంట్రాక్టు పూర్తయి మరో కంపెనీ చేతికి వెళ్లిన క్రమంలో సగానికిపైగా కార్మికులను తొలగించింది. అయితే, ఆ కాంట్రాక్టు ఉద్యోగాల కోసం మధ్య దళారులకు రూ.లక్షల్లో ముడుపులు ఇచ్చిన వారు ఇప్పుడు ఉద్యోగమూ లేక, అప్పులపాలై రోడ్డున పడ్డారు.
'మోడీ గోబ్యాక్' నినాదాలతో సిద్ధమైన విపక్షాలు
ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పేరుతో ఇక్కడివారికి ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఇచ్చిన వారినీ ఏడాదికే తొలగించిన వైనంపై విపక్షాల రాజకీయ పార్టీలు ఎన్నో ఆందోళనలు చేశాయి. మరోవైపు ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న సింగరేణి మైన్స్‌ను కేంద్రం ప్రయివేటుపరం చేసే చర్యలు చేపడుతూ ఇప్పుడు ఫ్యాక్టరీని జాతికి అంకితం పేరుతో వస్తున్న ప్రధాని పర్యటనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం రాష్ట్రంలో బీజేపీ పట్ల వ్యతిరేకతను కొంత తగ్గించేందుకు, ఇక్కడ ఆ పార్టీ అభాసుపాలవుతున్న పరిణామాలకు చెక్ పెట్టేందుకే కాకపోతే.. ఏడాదిన్నర కిందటే ఉత్పత్తులు ప్రారంభించిన ఫ్యాక్టరీకి ఇప్పుడు రావడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నాయి. 'మోడీ గో బ్యాక్' నినాదాలతో ప్రధానిని అడ్డుకునేందుకు సంసిద్ధమవుతున్నాయి.