Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవాలి : టీపీటీఎల్ఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగిని వేధించి ఆత్మహత్యాయత్నానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎ విజరుకుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రముఖ ప్రయివేట్ విద్యాసంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంజాల సతీష్ అనే ఉద్యోగిని ఆ యాజమాన్యం వేధించడం వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారని తెలిపారు. హుజరాబాద్ మండలం బొత్తలపల్లి గ్రామానికి చెందిన ఆయన ఆ విద్యాసంస్థలో 12 ఏండ్లుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వేధింపులకు గురిచేయడంతో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనీ, కుటుంబ సభ్యులు ప్రయివేటు ఆస్పత్రికి తరలించారని వివరించారు. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటూ డాక్టర్ చెప్పారని తెలిపారు. ఇప్పటి వరకు ఆ యాజమాన్యం స్పందించలేదని విమర్శించారు. అతని కుటుంబ సభ్యులు ఆ పాఠశాల యాజమాని ఇంటికెళ్లి అడిగితే ఎలాంటి సంబంధం లేదనీ, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ చెప్పడం అన్యాయమని తెలిపారు. సతీశ్‌కు ప్రాణహాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అతనికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని తెలిపారు. అతని వైద్యానికయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలని కోరారు.