Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీ కేటగిరీ సీట్లను కన్వీనర్ ద్వారానే భర్తీ చేయాలి : ఉన్నత విద్యామండలి కార్యదర్శికి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల దోపిడీపై విచారణ జరపాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీ కేటగిరీ సీట్లను కన్వీనర్ ద్వారానే భర్తీ చేయాలని కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావును బుధవారం హైదరాబాద్లో ఆ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు, ఎం దశరథ్, జిల్లా కమిటీ సభ్యులు వి కామేశ్బాబు, నాయకులు ఎ శ్రీరాములు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంజినీరింగ్ కాలేజీలు బీ కేటగిరీ సీట్లను నిబంధనలను ఉల్లంఘించి లక్షలాది రూపాయల డొనేషన్లు, అధిక ఫీజులు వసూలు చేశాయని విమర్శించారు. డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల సీట్లకు భారీగా ఫీజులు వసూలు చేశాయని తెలిపారు. ప్రయివేటు కాలేజీ యాజమాన్యాల దందా కొనసాగుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యంగానే మిగిలిపోయాయని విమర్శించారు. కొన్ని కళాశాలల్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఒక్కో విద్యార్థి నుంచి డొనేషన్ తీసుకున్నాయని పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కంటే ముందుగానే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తున్నాయని తెలిపారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించడం లేదని విమర్శించారు. జేఈఈ మెయిన్స్, ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా వాటిని పాటించడం లేదని పేర్కొన్నారు. అధికంగా డొనేషన్ చెల్లించిన వారికే సీట్లు కేటాయించారని తెలిపారు. ఒకటి రెండు కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ నిబంధ నలను ఉల్లంఘించి సీట్లు అమ్ముకు న్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం కారణంగా ఈ ఫీజుల దోపిడీ కొనసాగుతున్నదని తెలిపారు.
అధిక ఫీజులు, డొనేషన్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మెడికల్ ప్రవేశాల మాదిరిగా ఇంజినీరింగ్ యాజమాన్య సీట్లను కన్వీనర్ ద్వారానే భర్తీ చేయాలనీ, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.