Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లులపై సందేహాలను నివృత్తి చేసుకోవాలి: గవర్నర్ తమిళిసై
హైదరబాద్:ప్రయివేటు యూనివర్సిటీల వల్ల ఫీజులు పెరుగుతాయన్న వాదనలో వాస్తవం లేదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వద్దకు పంపిన బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని ఆమె అన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. అందుకే తాను సమయం తీసుకున్నానని వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్.. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. యూనివర్సిటీల్లో ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చామని తెలిపారు. ఆయా వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేయాలంటూ పదే పదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందనీ, తాను ఎలాంటి బిల్లులనూ ఆపలేదు.. తొక్కిపెట్టలేదని స్పష్టం చేశారు. వర్సిటీల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తనకు పలు సందేహాలున్నాయని వివరించారు. నూతనంగా నియమాక బోర్డును ఏర్పాటు చేయటం అవసరమా..? అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులతోపాటు వీసీలను కూడా భర్తీ చేయాలంటూ తాను చెప్పానని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎనిమిదేండ్లుగా వీసీ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ప్రొటోకాల్‌కు సంబంధించిన అంశాలపై పలువురు మాట్లాడుతున్నారనీ, వాస్తవానికి తన పర్యటనలకు సంబంధించిన వివరాలన్నింటినీ ముందుగానే ప్రభుత్వానికి పంపుతున్నానని గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు. ఆ ప్రొటోకాల్ పాటించని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొంతమంది రాష్ట్రంలో ఎక్కడ, ఎలాంటి సంఘటనలు జరిగినా రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునివ్వటం సరికాదన్నారు. 'ఇది ప్రగతి భవన్ కాదు.. రాజ్‌భవన్... దాని తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి...' అని వ్యాఖ్యానించారు. 'ఫాంహౌస్ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగే ప్రయత్నం చేశారు. నా మాజీ ఏడీసీ తుషార్‌ను ఈకేసులోకి తీసుకొచ్చిన కారణం అదే. ఆడియో టేప్ విషయంలోనూ రాజ్‌భవన్ ప్రస్తావన తెచ్చారు. ప్రత్యేకించి తుషార్ పేరును తెరపైకి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో రాజ్‌భవన్ పాత్ర ఉందని చెప్పే విధంగా అధికారిక ట్విటర్ ఖాతాల్లో రాసుకొచ్చారు. నా ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉంది. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది. తుషార్ ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు చెబితే ఆయన పేరు ఎలా తెచ్చారు. నా ఫోన్ ట్యాప్ చేసుకోండి.. కావాలంటే నా ఫోన్ ఇస్తాను చూసుకోండి. గవర్నర్ల అంశాలు, వివాదాలు ఒక్కో రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నాయి. ఖైదీల విడుదలలో హౌంశాఖ విధానాలను పాటించలేదు. జీవితఖైదు పడిన వారిని విడుదల చేయకూడదు. రాజ్‌భవన్ ముందు ఆందోళన చేస్తామని ప్రకటించిన వారి వెనుక ఎవరున్నారు..? ఎవరొచ్చినా.. ఎంతమందొచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నా...' అంటూ తమిళి సై సవాల్ విసిరారు.
సమయమివ్వండి... సందేహాలు నివృత్తి చేస్తాం
- గవర్నర్‌కు మంత్రి సబిత విజ్ఞప్తి
- రాజ్‌భవన్‌కు వస్తామంటూ సమాచారం
- అయినా పిలవని తమిళిసై
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు విషయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు విషయంలో కొన్ని సందేహాలను లేవనెత్తుతూ రాజ్‌భవన్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ వచ్చిందని వివరించారు. దీనిపై రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి సందేహాలను నివృత్తి చేయాలంటూ ప్రభుత్వం నుంచి తనకు ఆదేశాలు అందాయన్నారు. అందువల్ల గవర్నర్ సమయం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశామని అన్నారు. సమయం ఇవ్వగానే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తామన్నారు. ఆ బిల్లుకు సంబంధించి ప్రభుత్వపరమైన అంశాలతోపాటు న్యాయపరమైన సందేహాలను, ఇతర అంశాలపై వివరణిస్తామన్నారు. బుధవారం గవర్నర్ సమయం కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదురుచూశారు. ఆమె వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఇతర అధిఆరులు సైతం సిద్ధమయ్యారు. రోజంతా ఎదురుచూసినా గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి పిలుపు అందకపోవడం గమనార్హం.
యూజీసీ నిబంధనలకు లోబడే బోర్డు
మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు లోబడే విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు. యూజీసీతోపాటు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వంటి వివిధ సంస్థల మార్గదర్శకాలను పాటిస్తామంటూ ఆ బిల్లులో పొందుపర్చామని వివరించారు. ఇంకోవైపు విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన కమిటీకి వైస్ చాన్సలర్ (వీసీ) చైర్మెన్‌గా వ్యవహరిస్తారని అన్నారు. యూజీసీ నిబంధనలను ఉల్లంఘించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు బీహార్‌తోపాటు జార్ఖండ్‌లో విశ్వవిద్యాలయాల నియామకాలకు బోర్డు ఎప్పటి నుంచో పనిచేస్తున్నదని చెప్పారు. ఒడిశాలో వర్సిటీ సిబ్బందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నారని వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లో వర్సిటీ అధ్యాపకుల నియామకాలకు రాతపరీక్షను నిర్వహిస్తున్నారని అన్నారు. అవినీతికి తావులేకుండా తెలంగాణలో బిల్లును రూపొందించినట్టు చెప్పారు. బిల్లులో ఉన్న అంశాలపై గవర్నర్‌కు ఉన్న సందేహాలను ఇప్పటికే కొన్ని నివృత్తి చేశామన్నారు.
నిజాం కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తాం
నిజాం కళాశాల హాస్టల్ వివాదంపై ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్‌తో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ సమస్యను పరిష్కరించే బాధ్యతను నవీన్ మిట్టల్‌కు అప్పగించారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడుతున్నామని మంత్రి తెలిపారు. అక్కడ చదువుతున్న అమ్మాయిలను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని కోరారు.