Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు నిందితులతో పాటు సర్టిఫికెట్లు కొన్న మరో ఆరుగురు ఆరెస్ట్
- వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్‌జోషి వెల్లడి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
దేశంలో గుర్తింపు ఉన్న విశ్వ విద్యాలయాలకు సంబంధించి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాకు చెందిన ఆరుగురు నిందితులతోపాటు సర్టిఫికెట్లను కొనుగోలు చేసిన మరో ఆరుగురుని టాస్క్‌ఫోర్స్, హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారి నుంచి వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన 88 నకిలీ సర్టిఫికెట్లు, 9 నకిలీ సర్టిఫికెట్ల నమూనాలు, నాలుగు స్టాంపులు, హౌలో గ్రామ్స్, 16 సెల్ఫోన్లు, ఒక కలర్ ప్రింటర్, సీపీయూ, రూ.5.37లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఆకుల రవి అవినాష్ ఆలియాస్ అజరు(నర్సంపేట్ వరంగల్), లంకల శంకర్రావు(భద్రాద్రి కొత్తగూడెం), మీరా అక్తర్ ఆలీ బెగ్(హనుమకొండ), సుడిగ ఎల్లేష్(జీడిమెట్ల-హైదరాబాద్), ముప్పురి పురషోత్తం (రామంతపూర్-హైదరాబాద్) కామన ప్రీతం(హైదరాబాద్), ఐనవోలు సాయి శ్రవణ్ (సికింద్రాబాద్) కోటా అశోక్ (గుంటూరు) గండికొంట సందీప్ (నల్లగొండ) మనోజ్ సింగ్ (హైదరాబాద్), తల్లూరి సంప్రీత్(వనపర్తి), చిమరాల లక్ష్మీ ప్రసాద్(వనపర్తి) ఉన్నారు. కాగా బట్ట సందీప్, మెండి విజరు, సర్వేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వరంగల్ సీపీ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. ఈ ముఠాలోని సభ్యులు సులువుగా డబ్బు సంపాదించుకోవాలని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని నకిలీ సర్టిఫికెట్ల ముద్రణకు శ్రీకారం చుట్టారు. పెద్ద మొత్తం డబ్బులు తీసుకుని విదేశాల్లో ఉన్నత చదువుకు, ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు అవసరమున్న వ్యక్తులకు నకిలీ సర్టిఫికెట్లను విక్రయించేవారు. దేశంలో వివిధ విశ్వవిద్యాయాలకు సంబంధించి మూడేండ్ల గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను రూ. లక్షకు, నాలుగేండ్ల ఇంజినీరింగ్, ఆపై చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లకు రూ.లక్షన్నరకు విక్రయించేవారు. కాకతీయ యూనివర్సీటీకి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు పొందిన వ్యక్తుల వివరాలను ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులు యూపీకి చెందిన సర్వేశ్ కేయూ అధికార వెబ్సైట్ హ్యాక్ చేసి నకిలీ సర్టిఫికెట్లను నమోదు చేసేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు కాకతీయ, అంధ్ర, శ్రీవెంకటేశ్వర, నాగార్జున, శ్రీవెంకటేశ్వర దేవర్య యూనివర్సిటీలతో పాటు ఢిల్లీ విద్యాలయము, ఒపెన్ స్కూల్‌కు సంబంధించి ఇప్పటి వరకు 665కి పైగా వివిధ విద్యార్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను విక్రయించారు. వీటిని పొందిన 127 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారినీ త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నరేష్ కుమార్, హసనపర్తి, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్లు జనార్ధన్ రెడ్డి, నరేందర్, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐలు నిసార్ పాషా, లవణ్ కుమార్, భరత్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, తదితరులను సీపీ అభినందించారు.