Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్
నవతెలంగాణ-పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం ఆందోళనబాట పట్టారు. దాంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 65 శాతం కంటే తక్కువ హాజరున్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడంతో విద్యార్థులు యూనివర్సిటీ గేటు ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. గీతం వీసీ బయటకు వచ్చి తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు పోలీసులు యూనివర్సిటీ వద్దకు చేరుకొని విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మరింత ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులు విలేకరులతో మాట్లాడుతూ.. 65 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న దాదాపు 3 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందన్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.7,500 చొప్పున కట్టమంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలా కట్టినప్పటికీ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం సబ్జెక్టు పరీక్ష రాసుకునేందుకు అనుమతి ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యాజమాన్యం హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు తేల్చి చెప్పారు.