Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల దారి మళ్లింపు
- సీడబ్ల్యూఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు సుఖ్బీర్సింగ్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు
- ముగిసిన భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (బీసీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర మూడవ మహాసభలు
- నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఎస్. రామ్మోహన్, రత్నాకరం కోటంరాజు
నవతెలంగాణ-మహబుబాబాద్/కురవి
కార్మికులు పనిచేసే సమయంలో జరిగే ప్రమాదాల నుంచి కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రభుత్వం అడ్డగోలుగా దారిమళ్లిస్తుందని కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూఎఫ్ఐ) జాతీయ అధ్యక్షులు సుఖ్బీర్సింగ్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాజగోపాల్ ప్రాంగణంలో రెండు రోజులుగా జరిగిన బీసీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు బుధవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా బీసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు వంగూరి రాములు అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో భవన నిర్మాణరంగ కార్మికుల సమస్యలపై అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. కరోనా సమయంలో వెల్ఫేర్ బోర్డు నిధులు వెయ్యి కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్‌కి దారి మళ్ళించారని అన్నారు. ఆ నిధులను వెంటనే తిరిగి కార్మికుల సంక్షేమ దృష్ట్యా వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ కార్మికులను విస్మరిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారుల లాభార్జన కోసం కార్మిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు కనీసం ఇల్లు లేని దీనస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన లక్ష మోటార్ సైకిల్స్ పంపిణీ చేయాలని తీర్మానించామన్నారు. ప్రస్తుతం కార్మిక రంగంలో భవన నిర్మాణ రంగం అత్యంత విస్తృతంగా విస్తరించిందని కొనియాడారు. నిర్మాణ రంగానికి అనుబంధంగా 56 వృత్తులు ఉన్నాయని, వాటికి సంఘాలు ఏర్పాటు చేసి భవన నిర్మాణ రంగ సంఘానికి అనుబంధంగా చేర్చాలని పిలుపు నిచ్చారు. నేటి నుంచి బీసీడబ్ల్యూయూలో యూనియన్‌కు బదులు ఫెడరేషన్ చేర్చి బీసీడబ్ల్యూఎఫ్గా పిలవాలని మహాసభలో తీర్మానించారు. మహాసభకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు, సీఐటీయూ నాయకులు మధు, ఆకులరాజు, కుంట ఉపేందర్, బానోతు శంకర్, తడబోయిన శ్రీశైలం, జయలక్ష్మి, జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
61 మందితో నూతన కమిటీ ఎన్నిక
ఈ మహాసభ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని 61 మందితో ఎన్నుకున్నారు. వారిలో అఫీస్బేరర్స్గా 21మందిని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఎస్. రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం శ్రీనివాస్, కోశాధికారిగా ఎలుక సోమన్నగౌడ్ ఎన్నుకున్నారు.