Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేవీ?
- ఆర్ఎఫ్సీఎల్ను మళ్లీ ప్రారంభించడం విడ్డూరం
- మోడీ పర్యటనకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు
- నల్లజెండాలతో నిరసనలు తెలుపుతాం :టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్య, వైద్య, సాగునీటి, ఇలా అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తేల్చిచెప్పారు. మోడీ పర్యటనకు నిరసనగా ఈ నెల 12న అన్ని జిల్లాలు, యూనివర్సిటీల్లో నల్లజెండాల తో నిరసన తెలుపుతామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు, టీఎస్‌జేఏసీ చైర్మెన్ బండారు వీరబాబు, టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు నల్లగొండ అంజిబాబు, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకట్, టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షులు నక్క శ్రీశైలం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్చాల దత్తాత్రేయ, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రవీంద్రనాయక్, మైనార్టీ విద్యార్థి విభాగం నేత రహీం, లంబాడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు అశోక్‌నాయక్, దళిత వారియర్స్ నాయకులు కె.మధు, తెలంగాణ నేతగాని విద్యార్థి సంఘం అధ్యక్షులు ఎస్.ప్రసాద్‌నేత, ఎమ్ఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు ఎల్.నాగరాజు, ఎఐఎస్ఎఫ్ హైదరాబాద్ నగర కార్యదర్శి జి.నరేశ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ ఏమైందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 16 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయట్లేదని నిలదీశారు. ఉద్యోగాల భర్తీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రారంభించిన ఆర్ఎఫ్సీఎల్ను మళ్లీ ప్రధాని ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట మధు మాట్లాడుతూ..రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించిన మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణకు ఇస్తానన్న జిల్లాకో నవోదయ పాఠశాల, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్, త్రిపుల్ ఐటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ యువత, విద్యార్థుల పట్ల మోడీ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మెన్, ఓయూ జేఏసీ అధ్యక్షులు ఎల్చాల దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రంలోని పీహెచ్డీ విద్యార్థులు ఫెలోషిప్లను కోల్పోతున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ తొక్కిపెట్టడం వల్ల తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతున్నద న్నారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై రాష్ట్ర ప్రజలు తిరుగబడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు..