Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోయిన కొనుగోళ్లు ... ఎఫ్ఎంసీజీ కంపెనీల దిగాలు
హైదరాబాద్ : భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బక్కచిక్కిపోతోంది. ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో వినిమయం తగ్గిపోయింది. ఇందుకు నిదర్శనం ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల్లో తగ్గుదలనే. సబ్బులు, షాంపులు, బిస్కట్లు, కూకీస్, నోట్‌బుక్, చాక్లేట్లు, పాల ఉత్పత్తులు, ఫెయిర్‌నెస్ క్రీములు తదితర ఉత్పత్తులు ఎఫ్ఎంసీజీ రంగంలోకి వస్తాయి. తక్కువ విలువ కలిగి.. ఎక్కువ వాడకం కలిగిన ఈ ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ లేమిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో గ్రామీణ ప్రాంతాల వినిమయం 3.6 శాతం పడిపోయిందని నీల్సన్ఐక్యూ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇంతక్రితం జూన్ త్రైమాసికంలో వినిమయం 2.4 శాతం క్షీణించింది. ధరల పెరుగుదలకు తోడు అధిక వర్షాలు, మాంద్యం భయాలు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాలను 3.6 శాతం పడిపోయేలా చేశాయని నీల్సన్ఐక్యూ రిపోర్టు పేర్కొంది. మరోవైపు జులై- సెప్టెంబర్ కాలంలో పట్టణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినిమయం 1.2 శాతం పెరిగింది. ఇంతక్రితం త్రైమాసికంలో ఇది 0.6 శాతంగా నమోదయ్యింది. స్థూలంగా దేశంలో ఎఫ్ఎంసిజి రంగం అమ్మకాలు 0.9 శాతం క్షీణించాయి. ఇంతక్రితం త్రైమాసికంలో 0.6 శాతం తగ్గుదలను చవి చూశాయి.
'' గడిచిన జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో వినిమయంలో ప్రమాదకర ఘంటికలు కనబడ్డాయి. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో మందగమనం, నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాల కారణంగా వినిమయంపై ఒత్తిడి కొనసాగుతోంది. వరుసగా కురిసిన వర్షాలు గ్రామీణ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. రిటైల్ వ్యాపారంపై విశ్వాసం సన్నగిల్లింది. అమ్మకాలు తగ్గడంతో సాంప్రదాయ వర్తక రిటైలర్లు తక్కువ స్టాక్లను పెట్టుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తయారీదారులు రిటైల్ వర్తకులకు మద్దతును ఇవ్వాలి. సాధారణంగా పండగ సీజన్ ప్రారంభంతో మూడవ త్రైమాసికంలో వినియోగం పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరం వినియోగం పెరగలేదు.'' అని నీల్సన్ఐక్యు ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పిల్లయి అన్నారు.
ప్రతికూలతలో ఆహారేతర ఉత్పత్తులు
'' 2020 జనవరి - మార్చి కాలం నాటికే ఎఫ్ఎంసిజి అమ్మకాలు కోవిడ్ ముందు నాటి స్థాయికి చేరాయి. గడిచిన ఆరు త్రైమాసికాలుగా ధరల్లో రెండంకెల పెరుగుదల వృద్థి రేటును మందగించేలా చేశాయి. ఆ ప్రభావం వినిమయంపై పడింది. క్రితం సెప్టెంబర్ త్రైమాసికంలో అహారం ఉత్పత్తుల అమ్మకాల వృద్థి 3.2 శాతం పెరిగింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మైనస్ 0.3 శాతానికి పడిపోయింది.అహారేతర ఉత్పత్తుల వినిమయం ఏకంగా మైనస్ 6.8 శాతం క్షీణించింది.ఇంతక్రితం ఏప్రిల్ - జూన్‌లోనూ ఈ విభాగం మైనస్ 6.4 శాతం పతనాన్ని చవి చూసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడమే ఇందుకు కారణం. గడిచిన మూడు త్రైమాసికాల్లోనూ అహారేతర ఉత్పత్తుల వినిమయం కరోనాకు ముందు నాటికంటే తక్కువగా నమోదయ్యింది.'' అని నీల్సన్ఐక్యూ అధ్య యనం తెలిపింది.''వినియోగదారులు చిన్న ప్యాక్ పరిమాణాలను ఇష్టపడటం కొనసాగిస్తున్నారు.అయినప్పటికీ ఈ విభాగంలో ప్రతికూల వృద్థి చోటు చేసుకు ంది. చిన్న తయారీదారులు (టాప్ 400 తయారీదారులు మినహా, రూ.112 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వారు) క్రితం క్యూ3లో 0.5 శాతం వృద్థిని నమోదు చేశారు. కాగా.. ఏప్రిల్- జూన్‌లో మైనస్ 9.1 శాతం తగ్గుదలను చవి చూశారు. క్యూ3లో పెద్ద, మధ్యస్థ తయారీదారులు (టాప్ 400 కంపెనీలు) సానుకూల వృద్థిని నమోదు చేశారు. వినియోగంలో మందగమనం ఉన్నప్పటికీ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కొత్త ఆవిష్కరణలు ఎక్కువగా జరిగాయి. వీటిలో ఎక్కువగా ప్యాక్ పరిమాణంలో మార్పులు జరిగాయి. ముడి సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నందున వినిమయం పెరగడానికి తక్కువ గ్రాముల్లో ప్యాక్‌లను తయారు చేశారు'' అని నీల్సన్ఐక్యూ రిపోర్టు పేర్కొంది. దేశంలో నమోదవుతున్న అధిక ద్రవ్యోల్బణం అమ్మకాలను దెబ్బతీయడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆందోళనకు గురైతున్నాయని.. ఆ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.