Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు... పోలీసు బలగాలు, రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం
- నిరసనగా కందూకూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
- పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, జ్యోతి
నవతెలంగాణ-కందుకూరు
రంగారెడ్డి జిల్లా కందుకూర్ రెవెన్యూ కొత్తగూడ గ్రామపంచాయతీలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించాలని 2007లో సీపీఐ(ఎం) చేసిన పోరాటాల ఫలితంగా అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 788లో 188 మందికి 60 గజాల చొప్పున సర్టిఫికెట్లు అందజేశారు. 16 ఏండ్లు గడస్తున్నా వారికి ఇప్పటికి స్థలాలు కేటాయించకపోవడంతో ఎన్నో ధర్నాలు, వినతులు ఇచ్చినా ప్రభుత్వాలు స్పందించలేదు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన 188 కుటుంబాలు 16 రోజులుగా ఆ భూమిలో గుడిసెలు వేసుకొని రాత్రింబవళ్లు అక్కడే ఉండి పనులు చేసుకుంటున్నారు. కాగా, గురువారం పోలీసు యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వచ్చి అక్కడి నుంచి ఖాళీ చేయాలని వారిపై ఒత్తిడి తెచ్చారు. గుడిసెలు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఘటన విషయం తెలుసుకొని వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామ్‌చందర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, మండల కార్యదర్శి బి. శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు అంకగాళ్ల కుమార్, రైతు సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, మంచాల మండల కార్యదర్శి శ్యాంసుందర్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్. జంగయ్య, మండల కమిటీ సభ్యులు బుట్టి బాలరాజ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్దు, ఆర్. శేఖర్‌ను అరెస్ట్ చేసి యాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జ్యోతి అక్కడి చేరుకుని నిర్వాసితులతో కందుకూర్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అరెస్టు చేసిన నాయకులను విడిచి పెట్టేవరకూ ఇక్కడినుంచి కదిలేదిలేదని 4 గంటల పాటు అక్కడే కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2007లో సీపీఐ(ఎం) పోరాట పలితంగా అప్పటి ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు 60 గజాల చొప్పున, సర్టిఫికెట్లు అందజేసి ఇప్పటికి స్థలాలు కేటాయించలేదేని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి అయిన సబితాఇంద్రారెడ్డి పేదల పట్ల సానుకూలత వ్యక్తం చేయకుండా, సమస్యను పరిష్కరించకుండా, తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురువుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇండ్ల స్థలాలు చూపించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. పోలీసులు అరెస్టు చేసిన సీపీఐ(ఎం) నాయకులు విడుదల అనంతరం కందుకూరు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సామెల్, ఈ. నరసింహ, అల్లంపల్లి నరసింహ, నాయకులు గాదె కుమార్, సత్తయ్య, గుడిసెల నిర్వాసితులు పాల్గొన్నారు.