Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారుపై తీవ్రమవుతున్న నిరసన గళం
- రాష్ట్ర విభజన హామీల విస్మరణపై నిగ్గదీస్తున్న పార్టీలు
- రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు
- గోబ్యాక్ మోడీ అంటూ ప్లెక్సీల ప్రదర్శన
- నల్లజెండాలు ఎగరేస్తామని ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయంపై నిరసన గళం రోజురోజుకీ తీవ్రమవుతున్నది. మన రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులు, పరిశోధనా సంస్థలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, తదితరాలను గద్దలా తన్నుకుపోతున్న కేంద్రం తీరుపై తెలంగాణ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఏడాదిన్నర కిందట రామగుండంలో ప్రారంభమైన ఆర్ఎఫ్సీఎల్ను మళ్లీ ప్రధాని మోడీ జాతికి అంకితం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నది. లాభాల్లో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని అంబానీ, అదానీలకు కట్టబెట్టే కుట్ర ఈ పర్యటన వెనుక దాగున్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై స్పష్టతనివ్వాలనీ, ఇప్పటివరకూ చేసిన అన్యాయంపై తెలంగాణ సమాజానికి ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. లేదంటే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనీయబోమంటూ హెచ్చరిస్తున్నది. పోలీసు బలగాల మధ్య రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోడీకి ప్రజాస్వామిక పద్ధతిలో అడుగడుగునా నిరసనలు తెలిపేందుకు తెలంగాణ యావత్ ప్రజానీకం సన్నద్ధం అవుతున్నది. శనివారం ప్రధాని పర్యటన సందర్భంగా నల్లజెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చింది. దీనికి సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్షపార్టీలు, టీఆర్ఎస్, విద్యార్థి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలు, కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మోడీ గో బ్యాక్ అంటూ రాష్ట్రంలో పలుచోట్ల వెలుస్తున్న ఫ్లెక్సీలు చర్చనీయాంశమవుతున్నాయి.
మోడీ సర్కారు తెలంగాణకు చేస్తున్న అన్యాయాలు ఇవే...
యూపీఏ ప్రభుత్వం కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు వస్తే రాష్ట్రంలోనే విస్తృతంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి...రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుని ఆశపడ్డ తెలంగాణ యువత నోట్లో మోడీ సర్కారు మన్ను కొట్టింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై యువత గంపెడు ఆశలు పెట్టుకున్న ఇక్కడి నిరుద్యోగులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. తమకు అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశం లేదంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన తెలంగాణ యువత కండ్లల్లో కారం కొట్టినట్టు అయింది. చివరకు ఆ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించుకున్నది. విభజన చట్టం హామీ ప్రకారం ఏపీ, తెలంగాణలో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీనిచ్చింది. ఏపీలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసిన కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నది. ఉన్నత విద్య తమ ప్రాంతంలోనే పొందొచ్చని ఆశపడ్డ గిరిజన యువతకు కేంద్రం తీరు ఆశనిపాతమే. ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు చేస్తామన్న కేంద్రం హామీ నీటిమీది రాతలాగే మిగిలింది. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపితే.. అందులో మన రాష్ట్రానికి ఒక్కటి కూడా కేటాయించకుండా తన దుర్భిద్ధిని చాటుకున్నది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించేది. కానీ, రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పలుమార్లు ప్రకటించడం తెలంగాణ యువతపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్ధమవుతున్నది. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలోనూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం అంశంలోనూ కేంద్రంలోని బీజేపీ సర్కారు నాన్చివేత ధోరణిని అవలంబిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లు విషయంలో గవర్నర్ జోక్యం కూడా నిరుద్యోగ యువతకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నది. ఫ్లోరైడ్ నివారణ నిమిత్తం పరిశోధనా సంస్థను మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామన్న విషయాన్నే మరచిపోయింది. ఇంటింటికీ తాగునీటిని అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌భగీరథ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నయాపైసా విదల్చలేదు. నిటిఅయోగ్ నిధులివ్వాలని చెప్పినా పెడచెవిన పెట్టింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధుల విషయంలోనూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. లేబర్కోడ్లు తీసుకొచ్చి కార్మికవర్గానికి తీవ్ర నష్టం చేకూర్చింది. నోట్లరద్దుతో మొదలైన సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలు నేటికీ తీరకపోగా..భగభగ మండుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలతో మరింత తీవ్రం అయ్యాయి. ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కులం, మతం, ప్రాంతం, ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ సామదానబేధ దండోపాయాలను తెలంగాణ ప్రజానీకంపై బీజేపీ ప్రదర్శిస్తున్నది.