Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్‌ను వ్యతిరేకిస్తున్నారంటే దొంగలన్నట్టే కదా? : బీజేపీ నేతలపై తమ్మినేని విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ఆ వ్యవహారంతో సంబంధం లేకుంటే సిట్‌ను ఏర్పాటు చేసిన 24 గంటల్లోనే వారు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సింహయాజీ, రామచంద్ర భారతి, నందకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. నిందితుల తరఫు న్యాయవాది సమక్షంలోనే సిట్ విచారణ చేపట్టనుంది. అయితే ఈ విచారణను సవాల్ చేస్తూ బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారని తమ్మినేని తెలిపారు. దీన్ని వద్దంటున్నారంటే బీజేపీ నేతలు దొంగలన్నట్టే కదా?అని ఆయన విమర్శించారు. ఇది గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు యాదాద్రి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేశారని గుర్తు చేశారు. అలాంటప్పుడు సిట్‌ను ఎందుకు వద్దనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ సర్టిఫైడ్ వీడియో ఫూటేజీ ఉందనీ,, దాన్ని అన్ని సంస్థలకూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని గుర్తు చేశారు. వారి బాగోతం బయటపడుతుందనే సిట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారని విమర్శించారు. ఇంకోవైపు ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలంటున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ స్వభావానికి నిదర్శనమని తెలిపారు. కావాలనే తమను ఇరుకిస్తుందనే దానిపై ఇంతకుముందు సుప్రీం కోర్టులోనూ పిటిషన్ వేశారని గుర్తు చేశారు. దొంగలెవరో తేల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ చేపడుతున్నదని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని వశం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నదని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో బెదిరిస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్యేలను లొంగదీసుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.