Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిపేర్లపై అవార్డులు ఏర్పాటు చేయాలి
- భవిష్యత్ తరాలకు గుర్తుండాలి: శ్రద్ధాంజలి సభలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్థితప్రజ్ఞులుగా చిరకాలం గుర్తుండిపోయే పాత్రికేయులు జీఎస్ వరదాచారి, కేఎల్ రెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. వారిపేర్లపై రాష్ట్రస్థాయి అవార్డులు ఏర్పాటు చేస్తే, సహకారాన్ని అందిస్తామనీ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే), హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, వయోధిక పాత్రికేయుల సంఘం సంయుక్తాధ్వర్యంలో గురువారంనాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ పాత్రికేయులు చక్రధర్ అధ్యక్షతన శ్రద్ధాంజలి సభ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి, సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, వయోధిక పాత్రికేయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసు కేశవరావు, ఉడయవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు దిగ్గజ సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, కేఎల్ రెడ్డి కేవలం 24 గంటల వ్యవధిలో మరణించడం పట్ల సభ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వారికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా వక్తలు వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారు భాషతో పాటు సమస్యల లోతులపై సంపూర్ణ అవగాహన ఉన్న పాత్రికేయులనీ, అజాతశత్రువులుగా జీవించారని కొనియాడారు. వరదాచారి నిలకడ, స్థిరత్వం ఉన్న జర్నలిస్టు అనీ, కేఎల్ రెడ్డి అందుకు భిన్నంగా ఉండేవారనీ, కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. ఇరువురూ పాత్రికేయవృత్తిని ఉన్నతంగా నిలిపారనీ, నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తూ, మచ్చలేని వ్యక్తిత్వంతో జీవించారని తెలిపారు. పాత్రికేయులుగా సమాజానికి సేవచేస్తూనే, పాత్రికేయుల గుర్తింపు, వారి సంక్షేమాన్ని కాంక్షించిన గొప్పవ్యక్తి వరదాచారి అని చెప్పారు. వారి పేరుపై చిరస్థాయిగా గుర్తుండేలా రాష్ట్రస్థాయి అవార్డులు ఏర్పాటు చేయాలనీ, వాటికి తమ సహాయసహకారాలు అందిస్తామని బండారు దత్తాత్రేయ, కే కేశవరావు తెలిపారు. వరదాచారి ఎదుటివారి భావజాలాన్ని అర్థంచేసుకొనే వారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శ చేసేవారు కాదనీ స్పష్టంచేశారు. అందువల్లే ఆయన అజాతశత్రువుగా నిలిచారన్నారు. ఆయన చేసిన సేవల్ని వక్తలు గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో వరదాచారి కుటుంబసభ్యులు, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.