Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ వేర్వేరుగా గురువారం ప్రకటనలు విడుదల చేశారు. నూతన విద్యావిధానం అమలుతో అంతరాలు పెరిగి పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని విభజన హామీల్లో భాగంగా ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటు, గిరిజన విశ్వవిద్యాలయం, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు వంటి సమస్యలను ఇప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పరిష్కరించడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమతోపాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే రంగంతోపాటు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 12 లక్షలకుపైగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన మోడీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదని విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ పర్యటనకు వ్యతిరేకంగా శనివారం నిరసన ప్రదర్శనలు, నల్ల జెండాలతో నిరసనలు, మోడీ గో బ్యాక్ అంటూ కార్యక్రమాలు చేపడతామనీ, బెలూన్లను ఎగరవేస్తూ పర్యటనను అడ్డుకుంటామని పేర్కొన్నారు.