Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశాలపై విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. విదేశీ ఉద్యోగాల కల్పనపై వివిధ శాఖలు చేపట్టిన చర్యలపై బీఆర్కేఆర్ భవన్లో గురువారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న, సమర్థులైన అభ్యర్థులందరినీ గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టామ్‌కామ్ అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్‌లో నర్సింగ్ అభ్యర్థులను గుర్తించి, నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపి నమోదుచేసుకున్న నర్సింగ్ ప్రాక్టీషనర్లు అభ్యర్థులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సందేశంతోపాటు, కాల్‌సెంటర్ ద్వారా కూడా తెలియజేయాలని సూచించారు. నమోదిత అభ్యర్థులందరికీ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలనీ, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆటో మెకానిక్‌లు, నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ఇతర సారూప్య నిపుణుల కోసం ఇలాంటి ప్రక్రియను చేపట్టాలని ఆయన తెలిపారు. టామ్‌కామ్‌లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్టు అధికారులు సీఎస్‌కు వివరించారు. ఉద్యోగావకాశాలపై దృష్టి సారించేందుకు 20 దేశాలను ప్రాధాన్య దేశాలుగా గుర్తించినట్టు వారు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. ఈ సమావేశంలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.