Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, ఐటీ దాడులపై ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులకు పాల్పడటమనేది అత్యంత దుర్మార్గమని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. వారిద్దరూ మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. అందువల్లే కమలాకర్, రవిచంద్రకు చెందిన సంస్థలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జాజుల సురేందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఈడీ, ఐటీ దాడులతో బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని అన్నారు. ఆ పార్టీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడ్డా... బీసీ నేతలు బీజేపీకి లొంగబోరని స్పష్టం చేశారు.
ఖండిస్తున్నా : ఎంపీ వద్దిరాజు
గ్రానైట్ కంపెనీలు, వాటి కార్యాలయాలపై ఈడీ, ఐటీ దాడులు చేయటాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. గ్రానైట్ పరిశ్రమ అనేది మాఫియా కాదని ఆయన పేర్కొన్నారు. జీరో వ్యాపారం అంతకన్నా కాదని తెలిపారు. ఆయా పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో కష్ట, నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.