Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్‌పర్సన్‌గా కార్మిక, ఉపాధి కల్పన శాఖ స్పెషల్ సీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు విద్యాసంస్థల్లోని విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎస్) చైర్‌పర్సన్‌గా, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మహిళల భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో డీఏవీ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఆ పాఠశాల గుర్తింపును తొలుత రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఆ పాఠశాలకు తిరిగి తాత్కాలిక గుర్తింపును ఇచ్చింది. అయితే విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిల భద్రతకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కల్పించడం ఎంతో ముఖ్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. బాలికలకు భద్రత కల్పించడం పాఠశాల యాజమాన్యాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా, భద్రంగా ఉన్నామనే వాతావరణం కల్పించాలని సూచించారు. వారిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయొద్దని ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో బాలికలపై లైంగిక వేధింపులు, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేసినప్పటికీ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించడంతోపాటు తగిన చర్యలు తీసుకోవడం వల్ల వారు సర్దుకుపోతున్నారని తెలిపారు. అందుకే విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గరద్శకాలను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు.