Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడీ, ఐటీ పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు గురువారం లండన్ నుంచి మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజరు మాల్యాల వంటి మోసగాళ్లను మొదట దేశానికి పట్టుకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పై అక్రమంగా ఈడీ, ఐటీ దాడులు చేయడంపై మంత్రి స్పందించారు. మునుగోడు ఓటమి భరించలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రానైట్ వ్యాపారంలో ఉన్న మంత్రి గంగుల కుటుంబంపై కక్ష కట్టి ఐటీ దాడులు చేస్తున్నారనీ, బలహీన వర్గాల మంత్రి కాబట్టే ఐటీ దాడులని అన్నారు. దేశాన్ని అదాని, అంబానీకి గంప గుత్తగా అప్పగించిన మోదీ ప్రశ్నించే శక్తులపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు. గంగుల కమలాకర్ కు అన్ని విధాల అండగా ఉంటామని ఈడీ, ఐటీలకు బెదరబోమని స్పష్టం చేశారు.