Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల బెలూన్లతో నిరసన : గిరిజన సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 'నల్లబెలూన్ల'తో నిరసన తెలపాలని గిరిజన సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. తక్షణం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ, అటవీ సంరక్షణ నియమాలు-2022 బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. దేశంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతానికి రిజర్వేషన్ పెంచాలనీ, బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని కోరింది. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ నేతలు విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్ శ్రీరాంనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, టీిఆర్ఎస్ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రాజలింగం నాయక్, లంబాడీస్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు సురేష్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు కే. సోమ్లా నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. బాలు నాయక్, నాయకులు ఆర్.శేఖర్ నాయక్, ఆర్.పాండు నాయక్, గోరియా నాయక్, సురేష్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు చేయాలనీ, గిరిజన వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు కావస్తున్నా ఇంతవరకు యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదని విమర్శించారు.