Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ పరిధిదాటి వ్యవహరించడం సరికాదు : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ను నిర్వహించి ఎవరైనా రావొచ్చు, సమస్యలపై వినతిపత్రాలు ఇవొచ్చనడం సరైంది కాదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే సమస్యలను పరిష్కరిస్తుందని వివరించారు. సీఎం, మంత్రులకు అధికారాలుంటాయని పేర్కొన్నారు. గవర్నర్ రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరించడం సమంజసం కాదని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆపే అధికారం గవర్నర్‌కు లేదని విమర్శించారు. కానీ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రెస్‌మీట్ నిర్వహించి విమర్శలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. గవర్నర్ కేంద్రానికి రబ్బర్‌స్టాంప్‌లా, బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని పేర్నొన్నారు. రాజ్యాంగ పరిధిలో చట్టప్రకారం గవర్నర్ గౌరవంగా వ్యవహరించాలనీ, అగౌరవంగా వ్యవహరించడం సరైంది కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా కేంద్రం చెప్పినట్టు, బీజేపీ నాయకుల్లా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. ఇలాంటి వ్యవహారశైలిని మార్చుకోవాలని కోరారు. ఈ రకంగా అవలంభిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయబోవని తెలిపారు. బిల్లులను తొక్కిపెట్టడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా బిల్లులుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం గవర్నర్‌కు ఉందనీ, ఆపే అధికారం లేదని వివరించారు. తీరు మారకపోతే ప్రజలే గవర్నర్ పాత్రకు వ్యతిరేకంగా ఉద్యమించడంతోపాటు రాజ్‌భవన్‌ను ముట్టడించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు వ్యతిరేకంగా బిల్లులను తయారు చేస్తే ఆయా ప్రభుత్వాలకు వారే బుద్ధి చెప్తారని తెలిపారు.